Sunday, April 28, 2024

New Committee – తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి … ఆమోద‌ముద్ర వేసిన గ‌వ‌ర్న‌ర్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియ‌మించారు… మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ నేడు ఆమోదముద్ర వేశారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.

కాగా, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టింగ్‌ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్‌ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. కాగా,మహేందర్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా ఈ ఏడాది డిసెంబర్‌ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్‌ నిబంధనల ప్రకారం 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌స్థానం ..

ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్‌ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్‌ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్‌10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్‌ 8న దేశంలోని టాప్‌ 25 ఐపీఎస్‌ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement