Saturday, May 4, 2024

కేసీఆర్‌తోనే పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం కేసీఆర్‌ వలనే తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు నిదర్శనంగా తెలంగాణ పల్లెలు జాతీయ అవార్డులను గెలుచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. శుక్రవారం జాతీయ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ స్వశక్తి కరణ్‌ పురస్కారానికి ఎంపికైన మహబూబాబాద్‌ జిల్లా వెంకటాపురం గ్రామ సర్పంచ్‌ శీలం లింగన్న గౌడ్‌ను మంత్రి ఎర్రబెల్లి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, పల్లె ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు.

పల్లె ప్రగతి వలనే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని చెప్పారు. ఇటీవల ప్రకటించిన జాతీయ ఉత్తమ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో 19 అవార్డులు తెలంగాణకు దక్కాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సిఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మంత్రిగా తాను, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. అందుకే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తూ జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికవుతున్నాయని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో వెంకటాపురం సర్పంచ్‌ అందజేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డు వరించిందన్నారు. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయంగా సర్పంచ్‌ ట్రాక్టర్‌పై తీసుకెళ్ళి అంత్యక్రియలను నిర్వహించారని ఆయన గుర్తించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ లింగన్న గౌడ్‌ను అభినందిస్తూ .. వెంకటాపురం గ్రామాభివృద్ధికి తన సహకారాన్ని అందజేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement