Saturday, May 4, 2024

సాగ‌ర్ లో టి ఆర్ ఎస్ దే జోరు .. నేత‌ల ధీమా‌

హైదరాబాద్‌, : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో రికార్డుస్థాయి పోలింగ్‌ జరగ్గా, గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. కాంగ్రెస్‌ దిగ్గజనేత, మూడు దశాబ్దాలకు పైగా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన నేత జానారెడ్డిని ఢీకొట్టి విజయం సాధించడమంటే సాధారణ విషయం కాదని, పోటీ తీవ్రంగా ఉన్నా మంచి మెజారిటీతో బయటపడతామని పోలింగ్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2.20లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో దాదాపు 2లక్షల ఓట్లు పోల్‌కాగా, సీఎం సభ ప్రభావం ఓటర్లపై స్పష్టంగా కనిపించిందని.. అదే గేమ్‌ ఛేంజర్‌ అయిందని పార్టీవర్గాలు పోలింగ్‌ సరళిని బట్టి అంచనా వేస్తున్నాయి. పెద్దవూర, త్రిపురారం మండలాల్లో కాంగ్రెస్‌కు స్వల్పంగా మొగ్గు ఉండే అవకాశముందని, హాలియా, నిడమనూరు, నందికొండ, తిరుమలగిరిలలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యాలు దక్కే అవకాశముందని పార్టీ వర్గాలు క్షేత్రస్థాయి నుండి అందిన నివేదికలను బట్టి అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. గుర్రంపోడు మండలంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ఫైట్‌ జరిగిందని, ఇక్కడ ఎవరికీ పెద్దగా ఆధిక్యాలు దక్కకపోవచ్చని తెలుస్తోంది. పోలింగ్‌పై ఓ ఏజెన్సీ సర్వే నిర్వహించగా, కనీసం పదివేల మెజారిటీతో గెలుపు ఖాయమని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు మాత్రం 20వేల వరకు
మెజారిటీ వచ్చే అవకాశముందని బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుని చెబుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 7వేల ఓట్ల ఆధిక్యం మాత్రమే దక్కగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3 వేల ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ ఉప ఎన్నిక మాత్రం తమకే అనుకూలంగా ఉంటుందని, నిశ్శబ్దవిప్లవంతో ఊహించిన దానికంటే అధిక మెజారిటీ సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నెల్లికల్‌, ఎన్‌ఎస్పీ భూముల ఎఫెక్ట్‌
ముఖ్యమంత్రి హామీలు ఎన్నికల్లో బాగా పనిచేసినట్లు పోలింగ్‌ సరళిని బట్టి నేతలు విశ్లేషిస్తున్నారు. నెల్లికల్‌ లిఫ్ట్‌ ప్రభావం, నందికొండలో ఇరిగేషన్‌ భూముల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారికి పట్టాలు ఇస్తానని చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించి.. సీఎంపై నమ్మకంతో ఆయా మండలాల్లో గంపగుత్తగా జనం ఓట్లు మళ్ళించినట్లు పోలింగ్‌ సరళిని బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సామాజిక వర్గాల ప్రభావం, చీలికలు ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ప్రభావం చూపినట్లు కనబడుతోంది. పోలింగ్‌ తీరును బట్టి ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నా.. మే 2న ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ పక్కాగా అతి సూక్ష్మస్థాయిలో చేసిన గ్రౌండ్‌ వర్క్‌ ఫలించినట్లు పోలింగ్‌ సరళిని బట్టి నేతలు విశ్లేషిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు మంత్రి జగదీష్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఇన్‌ఛార్జిగా నియమించగా, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వరరెడ్డిని సమన్వయకర్తగా నియమిం చారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీనేతలకు బాధ్యతలు అప్పగించారు.
20వేల మెజారిటీతో గెలుస్తాం: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
నాగార్జునసాగర్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించబోతున్నామని, కనీసం 20వేల ఆధిక్యం సాధిస్తామని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల సమన్వయకర్త, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. పోలింగ్‌ అనంతరం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే తాము ఉంటా మని, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం.. అభివృద్ధితపథంలో నిలపడం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ప్రజలు విశ్వసించినట్లు కనబడిందన్నారు. ప్రచారం సందర్భ ంగా తాము చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని, ఫలితాల రోజు అది కనబడు తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

88 శాతంగా పోలింగ్‌..
రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాతంగా ముగిసింది. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు భారీగా తరలివ్చి తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు. సాయంత్రం 5 గంటలవరకు 81.5శాతం పోలింగ్‌ నమోదుకాగా, 7 గంటలకు 88 శాతంగా పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇది 90శాతం చేరవచ్చని అంచనా. 7 తర్వాత కూడా భారీగా ఓటర్లు ఓటేసేందుకు క్యూలో ఉండటంతో తుది ఓటింగ్‌ శాతం వెల్లడికి సమయం పడుతుందని అధికా రులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తి కాగా 6 నుంచి 7 గంటల వరకు కరోనా బాధితులు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. నియోజకవర్గంలోని గుర్రంపోడ్‌, పెదవూర, హాలియా, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి, నాగార్జునసార్‌ మండలాల్లోని మొత్తం 2,20,206 ఓటర్లుండగా, పోలింగ్‌ కోసం 346 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాలను శుక్రవారం ఉదయమే శానిటైజ్‌ చేశారు. పూర్తిగా కోవిడ్‌ నిబంధనల మేరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను కేంద్ర బలగాల పహారాలో నల్గొండలోని ఆర్జాలబావి గోదాముల్లో భద్రపర్చారు. అయితే అనుములలో జరిగిన ఘర్షణ దృష్టిలో పెట్టుకున్న ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని ఇన్‌చార్జీగా నియమించి ఒక ఎస్పీ, ఒక నాన్‌ క్యాడర్‌ ఎస్పీతోపాటు ఐదుగురు అదనపు ఎస్పీలు, 14మంది డీఎస్పీలు, 50మంది సీఐలు, 180మంది ఎస్‌ఐలు, 2750 మంది కానిస్టేబుళ్లు, 270మంది కేంద్ర బలగాలు, 270మంది ప్రత్యేక పోలీసు పటాల దళ సిబ్బంది అదనంగా పనిచేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement