Wednesday, May 15, 2024

సరిహద్దు నుండి పొంచి ఉన్న ముప్పు..

మంచిర్యాల : జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయా రాష్ట్రాల నుండి రోజు వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వారి రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, కనీసం స్క్రీనింగ్‌ పరీక్షలు కూడా చేయకుండా అనుమతిస్తుండటంతో జిల్లాలో కరోనా విజృంభనకు అది కూడా ఒక కారణం కానుంది. ఈ నేపథ్యంలో వెంటనే సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాకపోకలను నియంత్రించాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు వచ్చే ప్రయాణికులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం, అనుమానితులను ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించే లాంటి చర్యలు చేపట్టాలని, తద్వారా కరోనా వ్యాదిని అరికట్టడానికి ఎంతో దోహదపడుతాయని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. జిల్లా నుండి మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రైవేటు వాహనాల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నాయి. చెన్నూరు నుండి సిర్వంచ తదితర ప్రాంతాలకు 18 ట్రిప్పులు నడుపుతుండగా సుమారు వందల్లో ప్రైవేటు వాహనాలు కూడా వచ్చి పోతుంటాయి. వాటి ద్వారా వందలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ ప్రాంతాలను 63వ జాతీయ రహదారి కలుపుతుంది. ఈ జాతీయ రహదారి ద్వారానే రాకపోకలు సాగుతాయి. జిల్లా సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం రాపన్‌పల్లి సమీపంలో ప్రాణహిత నదిపై బ్రిడ్జిని ఏర్పడ్డ నేపథ్యంలో రాకపోకలు భారీగా జరుగుతున్నాయి. గతంలో ఆ వంతెన వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు రాకపోకలను నియంత్రించేవారు. ప్రస్తుతం రాకపోకల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, వచ్చే ప్రయాణికులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో రాకపోకల వల్ల కరోనా వైరస్‌ విజృంభించే పరిస్థితి నెలకొన్నందున వెంటనే అధికారులు వీటిపై దృష్టి సారించాలని సరిహద్దు ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తద్వారా కరోనా విజృంభించకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement