Tuesday, May 28, 2024

Adilabad – మావోల ఇలాఖాలో పోటెత్తారు! – కొమరంభీం జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంటకే 61% పోలింగ్ …

ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ పై అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోని మారుమూల గ్రామీణ ప్రజలు బారుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ సోమవారం పోలింగ్ జరగగా ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంటకు 57.6%, రెండు గంటలకు 62 శాతం పోలింగ్ నమోదయింది. విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణాల్లో 40% పోలింగ్ జరిగితే.. నిరక్షరాస్యత అధికంగా ఉన్న మారుమూల పల్లెల్లో ఓటు వేసేందుకు జయప్రయాసల కోర్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 256 సమస్యాత్మక కేంద్రాల్లో, 172 మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలు మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

వీడియో చిత్రీక‌ర‌ణ‌..

ఈ ప్రాంతాల్లో పోలింగ్ జరిగే వరకు వీడియో చిత్రీకరణ ద్వారా కంట్రోల్ యూనిట్ కు వెబ్ కాస్టింగ్ అనుసంధానం చేశారు. ఆసిఫాబాద్, సిర్పూర్ టి , మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ క్లోజ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో 56 శాతం పోలింగ్ జరగడం విశేషం. రాష్ట్రంలోనే అతి తక్కువగా 12 మంది అభ్యర్థులు అదిలాబాదులో పోటీ పోటీ చేస్తుండగా, రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే పోలింగ్ జరగడం ఓటర్ల చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. పైగా సాయంత్రం వరకు అదిలాబాద్ జిల్లాలో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలతో చల్లటి వాతావరణం లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

- Advertisement -

నాలుగు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

తమ గ్రామాలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించకుండా పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు గ్రామాల ప్రజలు సోమవారం పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావోజి పేటలో 371 మంది ఓటర్లు ఉండగా కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా ఎన్నికలను బహిష్కరించారు. కడెం మండలం అల్లంపల్లి, బాబా నాయక్ తండ రెండు గ్రామాల్లో 1600 ఓటర్లు ఉండగా తమ సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపిస్తూ ఓటింగ్ ను బహిష్కరించారు. బజార్హత్నూర్ మండలం మాన్కాపూర్ మారుమూల పల్లె వాసులు సైతం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటు వేయకుండా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లా బోరిగామ లోను గ్రామస్తులు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నిరసనతో పోలింగ్ కు దూరంగా ఉన్నారు. అయితే ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన మధ్యాహ్నం గ్రామాలకు వెళ్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement