Thursday, May 2, 2024

మాస్క్ ధరించం అంటూ మున్సిపల్ సిబ్బందిపై దాడి

కోవిడ్ కేసులు ఎక్కవగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంతమంది ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్ కార్మికులపై దాడికి పాల్పడుతున్నారు ఇలాంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లో వెళితే…  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ లో చెత్త సేకరించడానికి మున్సిపాలిటీ సిబ్బంది వెళ్లారు. ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి వారిపై ఎదురు దాడికి దిగాడు.’ నేను మస్క్ పెట్టుకోకపోతే మీకేంటి ? నీను పెట్టుకోను.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ పార , ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. దీనికి అతడితో పాటు అతని కొడుకు కూడా జతకట్టి వారిని బెదిరించారు. అంతే కాకుండా ఈ ఘటనను చిత్రీకరిస్తున్న వ్యక్తిపై కూడా దాడికి దిగారు. ఎంత ధైర్యం ఉంటే వీడియో తీస్తావురా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ తండ్రీ కొడుకుల ప్రవర్తనపై మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మాపై బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణచట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. మాస్క్‌ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు హెచ్చరించారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement