Saturday, May 4, 2024

కేంద్ర సంస్థకు మునిసిపాల్టీలు బాకీ.. రూ.90 కోట్లు చెల్లించాలని పురపాలక డైరెక్టర్‌ ఆదేశం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పురపాలక శాఖ డైరెక్టరేట్‌ పరిధిలోని చాలా వరకు మునిసిపాలిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు(ఈఈఎస్‌ఎల్‌) లిమిటెడ్‌కు చెల్లింపులు బాకీ పడ్డాయి. ఈ మొత్తం బకాయిలు రూ.90 కోట్ల వరకు ఉంటాయని, వీటిని వెంటనే చెల్లించాలని పురపాలక శాఖ డైరెక్టరేట్‌ ఆయా పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ) కమిషనర్‌లను ఆదేశించింది. మునిసిపాలిటీల పరిధిలో విద్యుత్‌ పొదుపునకు అవి ఈఈఎస్‌ఎల్‌తో గతంలో ఒప్పందం కుదుర్చుకుని ఇంధన పొదుపు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మునిసిపాలిటీలకు ఈఈఎస్‌ఎల్‌ పలు రకాల విద్యుత్‌ పొదుపు సేవలను అందించింది. ఈ సేవలకు అన్ని మునిసిపాలిటీలకు కలిపి రూ.200 కోట్ల వరకు బిల్లులను పంపించింది. వీటిలో మునిసిపాలిటీలు ఇప్పటివరకు రూ.110 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేశాయి. మిగిలిన చెల్లింపుల కోసం ఈఈఎస్‌ఎల్‌ ఒత్తిడి తేవడంతో పురపాలక శాఖ ఈ మేరకు మునిసిపాలిటీలను ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో మునిసిపాలిటీలు ఆర్థిక వనరుల ఆదాపై దృష్టి పెట్టాయి.

ఇందులో భాగంగా వీధి దీపాలకు వినియోగించే విద్యుత్‌ను ఆదా చేయాలని నిర్ణయించాయి. ఈ పొదుపు చర్యల్లో భాగంగా మునిసిపాలిటీలు ఈఈఎస్‌ఎల్‌తో విద్యుత్‌ ఆదా విషయమై ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలుత రాష్ట్రంలోని నిజామాబాద్‌, వరంగల్‌, రామగుండం, కరీంనగర్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌లతో పాటు గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్ల, తాండూరు, మహబూబ్‌నగర్‌, నల్గొండ మంచిర్యాల మునిసిపాలిటీల్లో పైలట్‌ ప్రాతిపాదికన ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదర్చుకున్న పురపాలక శాఖ అనంతరం అన్ని మునిసిపాలిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మునిసిపాలిటీల్లోని ఆయా వీధుల్లో ఈఈఎస్‌ఎల్‌ సంస్థ పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ లైట్లను బిగించడమే కాక వాటికి విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఈఈఎస్‌ఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి ఆయా స్థానిక సంస్థలకు సంబంధించిన స్టాండింగ్‌ కమిటీలలో చర్చించి తీర్మానాలు ఆమోదించుకున్నాయి.

మునిసిపాలిటీలు ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించిన ప్రధాన వీధుల్లో విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు, ప్యానెల్‌ బోర్డులు, జంక్షన్‌ బాక్సులకు అవసరమైన అన్ని రిపేర్టు పూర్తిచేయడం, పనిచేయకుండా ఉన్న లైట్ల స్థానంలో కొత్త లైట్లు అమర్చడం, వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్న మీటర్లు బిగించడం, ఇతరత్రా అన్ని రకాల పనులు, మరమ్మతులను ఆ సంస్థ పూర్తి చేసింది. దీంతో ఈఈఎస్‌ఎల్‌ నిర్వహణలోకి వెళ్లకముందు ఆ తర్వాత మునిసిపాలిటీల్లో వీధి దీపాలకు ఎంత విద్యుత్‌ వినియోగమవుతుందో కచ్చితమైన లెక్క స్థానిక సంస్థలకు దొరికింది. ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం అమలు చేయడానికిగాను పట్టణ స్థానిక సంస్థల్లో ఏఈ లేదా డీఈ స్థాయి అధికారిని లైజన్‌ అధికారిగా నియమించారు. ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు మునిసిపాలిటీల పరిధిలో వీధి దీపాలకు అయ్యే విద్యుత్‌ బిల్లులను ఎస్క్రో ఖాతాలకు బదిలీ చేయడానికి కమిషనర్లు అంగీకరించారు. దీంతో పాటు ఆయా మునిసిపాలిటీల్లో వీధి దీపాలకు సంబంధించిన మీటర్‌ రీడింగ్‌, లోడ్‌ ఫ్యాక్టర్‌ అన్నింటిని సమగ్రంగా నమోదు చేయాల్సిన బాధ్యతను ప్రత్యేకంగా నియమించిన లైజన్‌ అధికారులపై ఉంచారు. అయితే ఈఈఎస్‌ఎల్‌ కారణంగా మునిసిపాలిటీలు ఇప్పటివరకు ఎంత వరకు విద్యుత్‌ పొదుపు చేశాయనదానికి సంబంధించి గణాంకాలను పురపాలకశాఖ వెల్లడించాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement