Thursday, April 25, 2024

Health: డిసెంబర్ దాకా జాగ్ర‌త్త‌గా ఉండాలే.. క‌రోనా ముప్పు ఇంకా పోలే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని… అయినప్పటికీ కరోనా నాలుగోవేవ్‌ వచ్చే పరిస్థితులు లేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు చెప్పారు. కరోనా వైరస్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని, వచ్చే డిసెంబర్‌ వరకు కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయన్నారు. అయినప్పటికీ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కేసులు పెరిగితే బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఫైన్‌ వేసే పరిస్తితి వస్తుందని హెచ్చరించారు. జ్వరం, తలనొప్పి, వాసన లేకపోతే కచ్చితంగా కరోనా టెస్టు చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం జలుబు, గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలు మాత్రమే కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా… ఆసుపత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై శుక్రవారం ఆయన కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మూడు రోజులుగా తెలంగాణలో రోజూ 100 సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. మూడు నెలల తర్వాత మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఎక్కువగా కరోనా కేసులు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 1శాతానికి చేరుకుందన్నారు. మే నెల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ2 కేసులే దాదాపు 65శాతం మేర నమోదయ్యాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినందున ప్రజల్లో కరోనా ఇమ్యూనిటీ పెరగిందని, ఈ పరిస్థితుల్లో కేసులు పెరిగినా నాలుగో వేవ్‌ రాదన్నారు.

విద్యా సంస్థలు కరోనా వ్యాక్సినేషన్‌కు సహకరించాలి
ఈ నెల 3 నుంచి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ 12-18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు. జూన్‌ 12 నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నందున విద్యా సంస్థలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సహకరించాలన్నారు. జీహెచ్‌ఎంసీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొద్దిగా నెమ్మదించిందన్నారు. విద్యా సంస్థలు కోరితే ప్రత్యేక వ్యాక్సిన్‌ క్యాంపులను పాఠశాలల్లోనే ఏర్న;పాటు చేస్తామన్నారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఎక్కువ కేసులు నమోద య్యాయన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ ఏడాది సీజనల్‌ వ్యాధుల సంఖ్యలో పెరుగుదల నమోదైందన్నారు. డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 2019లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని గుర్తు చేశారు. జలుబు, జ్వరం, పొడి దగ్గు లక్షణాలుంటే … వెంటనే ఐసోలేట్‌ అయి కొవిడ్‌, డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ మహానగర పరిధిలో డెంగీ కేసుల పెరుగుదలపై జీహెచ్‌ఎంసీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

వరుసగా నాలుగో రోజూ 100కిపైగా కేసులు
తెలంగాణలో వరుసగా నాలుగో రోజు రోజువారీ కరోనా కేసుల సంఖ్య 100మార్కును దాటింది. తాజాగా రాష్ట్రంలో 155 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 16319 మంది కి కరోనా టెస్టులు చేయగా 155 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా… రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1000కి చేరువలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌ లేదంటే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 907గా నమోదైంది. కరోనాతో చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకోవడంతో 59మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా 81 కేసులు హైదరాబాద్‌లో, రంగారెడ్డిలో 42, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement