Monday, April 29, 2024

Revanth Reddy: బీఆర్ఎస్ జాబితాలో సగం మందికి పైగా ఓటమి ఖాయం

హైదరాబాద్: బీఆర్ఎస్ జాబితాలో సగం మందికి పైగా ఓటమి చెందడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మైనార్టీ డిక్లరేషన్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌లో ఓడిపోతానని సీఎం కేసీఆర్‌ బలంగా నమ్ముతున్నారని, అందుకే కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని విమర్శించారు. కానీ రెండు నియోజవర్గాల్లోనూ ఆయన ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పారిపోతున్నారని తాను గతంలోనే చెప్పానని, మైనార్టీ నేత షబ్బీర్‌ అలీ చేతిలో ఆయన ఓటమి పాలవ్వడం ఖాయమన్నారు.

మైనారిటీ డిక్లరేషన్ కమిటీకి చైర్మన్‌గా తనను ఎంపిక చేశారని, ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులతో ఇవాళ డిక్లరేషన్‌పై చర్చించామని రేవంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 4శాతం మైనార్టీ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తే.. దానిని 12 శాతం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ కేవలం మాటలతోనే సరిపెట్టేశారని విమర్శించారు. కనీసం మైనార్టీ విభాగాన్ని కూడా బలోపేతం చెయ్యలేదు. అధికారుల లేమితో ఆ విభాగం నిర్వీర్యమవుతోందన్నారు. ముస్లిం డెవలప్‌మెంట్‌, వక్ఫ్‌ బోర్డు భూముల పరిరక్షణ కోసం ఏం చెయ్యాలన్నదానిపై చర్చించామని, కమిటీలో కొన్ని వినతిపత్రాలు వచ్చాయన్నారు. వాటిపై మరోసారి చర్చిస్తామని రేవంత్‌ అన్నారు.

” భారాస జాబితా చూశాక వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దేనని తేలిపోయింది. గజ్వేల్‌లో గెలుపుపై నమ్మకం లేకనే కేసీఆర్‌ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఆయన స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. కామారెడ్డి గడ్డపై పుట్టిన వ్యక్తిని నేను. ఆ నియోజకవర్గ ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. కేసీఆర్‌ను అక్కడి ప్రజలు ఓడిస్తారు. ముస్లిం, మైనార్టీ లీడర్ అని చూసి అక్కడ పోటీ చెయ్యాలని చూస్తున్నారు. కేసీఆర్‌ ఎక్కడా గెలవరు. ఆయన్ని ఇంటికి పంపడం ఖాయం. కామారెడ్డి అభివృద్ధికి కేసీఆర్ చేసిందేమీ లేదు.” అని రేవంత్‌ అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement