Sunday, May 5, 2024

మేకిన్ ఇండియాకు మోడీయే అడ్డంకి, ప్రచారం తప్ప చేసిన పనేమీ లేదు : పొన్నాల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎర్రకోట మీద నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో సొంత ప్రచారమే తప్ప నిజానికి సాధించిన ఘనతలేవీ లేవని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల రక్తంలో నరనరాన దేశభక్తి ఉందని, మోదీ కొత్తగా వచ్చి నేర్పాల్సిందేమీ లేదని మండిపడ్డారు.

ఎవరైనా మువ్వన్నెల జెండా పట్టుకోకపోతే వారు దేశద్రోహులేనా అని ప్రశ్నించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడైనా తిరంగా జెండా పట్టుకుని తిరిగారా అని నిలదీశారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని కాకముందు ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించి ఎక్కడైనా ప్రస్తావించారా అన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రచారం చేస్తున్న మోదీ, నిజానికి అందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థలో 118 ఫైటర్ జెట్స్ తయారు చేయాల్సి ఉండగా, ప్రధాని మోదీ దాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే భారత్‌లో ఆయుధాల తయారీకి రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ మధ్యనే మోదీ రద్దు చేశారని అన్నారు. ప్రపంచంలో ఆయుధాలు తయారుచేస్తున్న 100 కంపెనీల్లో భారత ప్రభుత్వానికి చెందిన హెచ్ఏఎల్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థలు వరుసగా 46, 56, 65వ స్థానాల్లో ఉన్నాయని.. వాటిని నిర్వీర్యం చేసేలా మోదీ వ్యవహరిస్తున్నారని పొన్నాల ఆరోపించారు.

డిజిటల్ ఇండియా అంటున్న మోదీ 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ. 20 వేల కోట్లు మంజూరు చేసి ప్రతి గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ తీసుకొచ్చే పథకాన్ని మొదలుపెడితే.. ఆ ఘనత తనదిగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రంగంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఐటీ రంగంలో భారత్ 11% వాటా కలిగి ఉందని, ఇదేమీ మోదీ ప్రధాని అయ్యాక సాధించిన ఘనత కాదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో వేసిన పునాదులతోనే దేశం ఎన్నో రంగాల్లో పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement