Wednesday, May 15, 2024

Minister War – దుర్బేధ్య బరి – కెటిఆర్ ‘సిరి’సిల్లా

బరిలో ఉండనున్న మంత్రుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కేటీఆర్‌ సిరిసిల్ల గురించే… తొలిసారి పోరు హోరాహోరీగా జరిగినా, ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఆయన సునాయాసంగానే గెలుస్తూ వచ్చారు. ఈసారి అయితే ఏకపక్షంగా మినిస్టర్‌ వార్‌ జరుగనుందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ…

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో:


భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎం కేసీఆర్‌ తనయుడు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లి నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తు న్నారు. రానున్న ఎన్నికల్ల్లో గత మెజారిటీని బద్దలు కొట్టేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలను అనుసరిం చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 2009 నుండి వరుస విజయాలు సాధిస్తున్నారు. 2010లో తెలంగాణ సాధనకోసం రాజీనామా చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. మొదట 2009లో తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. అప్పటి నుంచి కేటీఆర్‌ నియోజవర్గంలో పట్టును పెంచుకుంటూ వచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
2018 డిసెంబరు 17న టీ-ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి 2019 సెప్టెంబరు 8న తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల రూరల్‌ మండలాలతోపాటు సిరిసిల్ల పట్టణం ఉంది. ఈ ప్రాంతాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, మునిసిపల్‌ చైర్మన్‌ వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ వారే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో తనపై పోటీ చేసిన కొండూరి రవీందర్‌ రావును ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అప్పటికే ఆయన కరీంనగర్‌ సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా ఉండగా పార్టీలో చేరడంతో టెస్కాబ్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు.

తెలుగుదేశం నాయకుడైన గూడూరు ప్రవీణ్‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఇప్పుడు చేనేత కార్పోరేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్‌ రెడ్డి, తెలుగుదేశంలోని మాజీ జడ్పీ చైర్మన్‌(లక్ష్మారెడ్డి మరణించారు)లను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అన్నమనేని నర్సింగరావుతోపాటు చాలా మంది నేతలు కూడా ఆకర్షితులుకావడంతో బీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మలిచారు. అంతో ఇంతో బలంగా ఉన్న బీజేపీ సైతం పూర్తిగా బలహీనపడింది. గంభీరావుపేటకు చెందిన మాజీ సర్పంచ్‌, మాజీ జడ్పీటీసీ మల్లుగాని నర్సగౌడ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయన బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినా నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. తిరిగి ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి కొద్దిరోజులు ఉండి మళ్లి బీజేపీలోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండి టికెట్‌ ఆశిస్తున్నారు.

ఇదే గంభీరావుపేటకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పలు దఫాలుగా ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన కటకం మృత్యుంజయం గత పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు శ్రీధర్‌ గంభీరావుపేట నుంచి సర్పంచ్‌గా గెలుపొందారు. శ్రీధర్‌ బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ మృత్యుంజయం గొంతుక మూగబోయింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట వీర్నపల్లిలు గతంలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కూడా పట్టుసాధించారు కేటీ ఆర్‌. ఈ ప్రాంతానికి చెందిన మాజీ జడ్పీటీసీ తోట ఆగయ్యను పార్టీలో చేర్చుకొని నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా నియమించారు. సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతూనే ప్రతి సామాజిక వర్గానికి ప్రయోజనం చేసే కార్యక్రమాలు చేపడుతూ బీఆర్‌ఎస్‌ను సిరిసిల్ల పట్టణ కేంద్రం నుంచి పల్లె వరకు బలోపేతం చేశారు. గతంలో నియోజకవర్గం నేతలను పట్టించుకోవడం లేదని, అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడంలేదనే అపోహలకు తెరదించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో, కేడర్‌తో మమేకమవుతున్నారు.

ఉద్యమంలో పాల్గొనేందుకు….
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తండ్రితో పాటు పాల్గొనేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్‌. 2004 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్‌ తెలంగాణ ఏర్పాటు-పై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల్లో కేటీ-ఆర్‌ చురు-కై-న పాత్ర పోషించారు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు- టీ-ఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్‌. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ-చేసి గెలుపొంది అప్పటినుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పూర్వపు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సీపీఐ నుంచి ప్రాతినిథ్యం వహించిన చెన్నమనేని రాజేశ్వర్‌ రావు రికార్డును కేటీఆర్‌ బద్దలు కొట్టి నాలుగుసార్లు గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement