Saturday, May 4, 2024

భద్రాచలంలో వరద ఉదృతిని పర్యవేక్షించిన మంత్రి పువ్వాడ

భద్రాచలం, జులై 27 (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం భద్రాచలంలో పర్యటించి సమీక్షించారు. భద్రాచలం కరకట్ట చేరుకొని మంత్రి, కలెక్టర్ డా. ప్రియాంక, వరదలు ప్రత్యేక అధికారి అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్,మాజీ ఎమ్మెల్సీ బాలసాని తదితరులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను ఆదేశించారు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎత్తివేయడం ద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ అన్నారు.

రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిత్యం అప్రమత్తం ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ ను ఆదేశించారు. భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను మెరుగు పరచి, మరికొన్ని పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement