Saturday, April 27, 2024

Swachh HYD: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం: కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఇవాళ స్వ‌చ్ఛ ఆటోల‌ను మంత్రి కేటీఆర్ ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం ప్రారంభించాం. న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు నాడు కేసీఆరే స్వ‌యంగా 2500 స్వ‌చ్ఛ ఆటోల‌ను ప్రారంభించి.. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ – స్వ‌చ్ఛ తెలంగాణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గ‌త ఐదారు సంవ‌త్స‌రాల నుంచి కేంద్రం ప్ర‌క‌టించే స్వ‌చ్ఛ భార‌త్, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ ర్యాంకింగ్స్‌లో బెస్ట్ న‌గ‌రంగా హైద‌రాబాద్ నిలుస్తూ వ‌స్తుంద‌న్నారు. ఎక్క‌డికక్క‌డ‌, ఎప్ప‌టిక‌ప్పుడు న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు శ్ర‌మిస్తున్న మున్సిప‌ల్ సిబ్బందికి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

స‌ఫాయి అన్న.. నీకు స‌లాం అన్న.. అని మొట్ట‌మొద‌టిసారిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఆ మాట‌తోనే స‌రిపెట్ట‌కుండా, స‌ఫాయి కార్మికులు అడ‌గ‌క‌ముందే మూడు సార్లు జీతాలు పెంచార‌ని గుర్తు చేశారు. న‌గ‌రంలో 2500 ఆటో టిప్ప‌ర్లు ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందు 3500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్ప‌త్తి అయ్యేది. ఈ ఆటో టిప్ప‌ర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేక‌రించ‌డం వ‌ల్ల‌.. 6500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్ప‌త్తి అవుతోంది. మొత్తంగా చెత్త‌ను డంప్ యార్డుల‌కు త‌ర‌లిస్తున్నారు.

ఇవాళ ప్రారంభించుకున్న 1350 వాహ‌నాల‌తో క‌లిపితే 5750 పైచిలుకు వాహ‌నాలు జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్నాయి. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నాం. జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద‌దైన వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్‌ను జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో 20 మెగావాట్ల సామ‌ర్థ్యంతో ప్రారంభించుకున్నామని తెలిపారు. మ‌రో 28 మెగావాట్ల ప్లాంట్‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ల‌భించాయి. ఈ ప్లాంట్ నిర్మ‌ణ ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. చెత్త నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నాం. న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ముందుకు రావాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement