Monday, May 20, 2024

ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల‌దాడి..

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. 13వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో ఈ ఘటన జరిగింది. ఇంటి తలుపు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. ఈ దాడుల్లో ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, ఢిల్లీలోని అసదుద్దీన్‌ ఒవైసీ నివాసం తలుపుపై రెండు అద్దాలు పగిలి ఉన్నాయ‌ని తెలిపారు. పగిలిన అద్దాల పరిసరాల్లో ఎలాంటి రాయి లేదా మరే ఇతర వస్తువులు కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారని, దర్యాప్తు జరుగుతోందని అధికారి వెల్లడించారు.

ఈ దాడిపై ఢిల్లీలో మీడియాతో అస‌దుద్దీన్ మాట్లాడుతూ, దేశ రాజధానిలోని తన నివాసంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, 2014 తర్వాత ఇది నాలుగో ఘటన అని ఒవైసీ ఆరోపించారు. కొన్నాళ్లుగా తన నివాసంపై రాళ్ల దాడి జరుగుతోందని ఇలాంటి రాళ్ల దాడి గురించి తనకు భయం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే ఈపాటికి పెద్ద గొడవ అయ్యేదని ఈ దేశంలోని ముస్లింల ఇళ్లపై ఓ వైపు బుల్డోజర్లు,మరోవైపు రాళ్లదాడులు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్న ఆయన ఈ దేశంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా జరగుతున్న హింసపై ప్రధాని మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. పర్యానాలోని నుహ్ లో జరిగిన కూల్చివేతను ప్రధాని ఇప్పటి వరకు ఖండించలేదని ఆరోపించారు. యూపీ, హర్యానా, గుజరాత్ లలో బుల్డోజర్ విధానం నడుస్తోందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement