Sunday, April 28, 2024

సిపి సుబ్బ‌రాయుడు ‘కోటి’ సాయం – రుణం ఎలా తీర్చుకోవాలంటూ చిత్రప‌టానికి పాలాభిషేకం..

క‌రీంన‌గ‌ర్ – 80 ఏళ్ల వృద్ధాప్యం.. పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన 56 ఎకరాల విలువైన భూమిని డబ్బులు తీసుకోకుండా నమ్మి రిజిస్ట్రేషన్ చేయడం.. కొనుగోలు చేసిన వ్యక్తి మోసం చేయడం.. శరీరం సహకరించకున్నా ఖద్దరు ఖాకీ చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షణ చేయడం.. విసిగి వేసారి ఆశ వదులుకొనే సమయంలో ఆ వృద్ధురాలికి కరీంనగర్ సిపి సుబ్బారాయుడు న్యాయం చేశారు.. ఒక కోటి 5 లక్షల రూపాయలు ఇక రావు అనుకునే సమయంలో సిపి సుబ్బారాయుడు చొరవ వల్ల మోసపోయిన కోటి రూపాయల నగదు తిరిగి రావడంతో ఆ వృద్దురాలి ఆనందానికి పరిమితులు లేకుండా పోయాయి. తమకు సంపూర్ణన్యాయం చేసిన సిటీ సుబ్బారాయుడు చిత్రపటానికి వృద్ధురాలు పాలాభిషేకం నిర్వహించింది..

వివ‌రాల‌లోకి వెళితే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో నివాసముంటున్న శ్యామలాదేవి తనకు వారసత్వంగా వచ్చిన సిద్దిపేట అనంతసాగర్ లో 56 ఎకరాల భూమిని 1.60 కోట్ల రూపాయలకు తిరుపతయ్య అనే వ్యక్తికి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతయ్య భయాన కింద 55 లక్షల రూపాయలు శ్యామలాదేవికి అందించి రిజిస్ట్రేషన్ రోజున నగదు అందలేదని పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి నమ్మించి వృద్ధురాలని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ తంతు పూర్తయిన నాటి నుండి తిరుపతయ్య శ్యామలాదేవికి చెప్పకుండా మోసం చేస్తూ తిరుగుతున్నాడు. వృద్ధాప్యంలో వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన నగదు తిరుపతయ్య అప్పనంగా మోసం చేశాడని గ్రహించిన శ్యామల దేవి ఆనాటి నుండి రాజకీయ నాయకులు పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతూ వచ్చింది. అయినా కూడా శ్యామల దేవికి ఎవరు న్యాయం చేయలేకపోయారు. ఇటీవల కరీంనగర్ సిపి గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారాయుడు వద్దకు శ్యామలాదేవి వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది.. తనకు జరిగిన మోసాన్ని విలపిస్తూ సిపికి విన్నవించింది.. వృద్ధాప్యంలో మోసపోయిన తీరుకి చలించిన సిపి సుబ్బారాయుడు ఆమెను మోసం చేసిన తిరుపతయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు కాగానే తిరుపతయ్య బాధితురాలు శ్యామలాదేవి వద్దకు వచ్చి ఆమెకు ఇవ్వాల్సిన కోటి ఐదు లక్షల రూపాయల నగదును చెల్లించాడు. ఇక రావు అనుకున్న కోటి రూపాయల నగదు తిరిగి రావడంతో శ్యామల దేవి క‌మిష‌న‌ర్ సుబ్బ‌రాయుడి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సుబ్బారాయుడు కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించింది. ఖద్దరు, ఖాకిలపై నమ్మకం కోల్పోయిన సమయంలో సుబ్బా రాయుడు రూపంలో తనకు న్యాయం చేసి పోలీస్ లపై నమ్మకం కుదిరేలా చేశారని శ్యామలాదేవి పేర్కొంటూ సిపికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement