Sunday, April 28, 2024

MBNR: నారాయణపేట జిల్లాలో… ముగ్గురు బీజేపీ కీలక నేతల రాజీనామా…

మక్తల్, ఏప్రిల్12 (ప్రభ న్యూస్) : పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీకి నారాయణ పేటలో భారీ షాక్ తగిలింది. జిల్లాలో కీలకమైన ముగ్గురు నాయకులు పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొత్త కాపు రతంగపాండు రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మక్తల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డితో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి రఘురామయ్య గౌడ్, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు నిన్న రాత్రి పొద్దు పోయాక రాజీనామా చేశారు.

రాజీనామాలు లేఖలను వారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులకు పంపించారు .30 సంవత్సరాలుగా కొత్త కాపు రతంగపాండు రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. మండల స్థాయి మొదలుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు కీలక పదవులు చేపట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్టు ఆశించగా, ఆయనకు టికెట్టు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి ఆయనను పార్టీలో చేర్చుకొని రెండవసారి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. బీజేపీ, బీజేవైఎంలో వివిధ హోదాల్లో పనిచేసిన రతంగపాండు రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనతో పాటు ముఖ్య అనుచరుడు జిల్లా పార్టీ కార్యదర్శి రఘురామయ్య గౌడ్ కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇక మక్తల్ నియోజకవర్గంలో 30ఏళ్లుగా పార్టీ బాధ్యతలను తనపై పూర్తిస్థాయిలో వేసుకొని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య బీజేపీని తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో కొండయ్య అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు. మొదటి నుండి నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసిన కొండయ్యను కాదని మాదిరెడ్డి జలంధర్ రెడ్డికి పార్టీలో రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అదే సమయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా మూడవ స్థానంలో నిలిచారు. పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించినప్పటికీ మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం నారాయణపేట జిల్లాలో చర్చనీయంశంగా మారింది.

- Advertisement -

పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో జిల్లాలో ముగ్గురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం ఉమ్మడి జిల్లాలోనే చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ షాక్ నుండి తేరుకోవడానికి బీజేపీకి కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. కాగా ఇటీవలే పార్లమెంట్ టికెట్ ఆశించి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగిన మక్తల్ నియోజకవర్గ నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు కొంతమంది జితేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా నారాయణపేటకు చెందిన కొత్త కాపు రతంగపాండు రెడ్డి రఘురామయ్య గౌడ్ సైతం జితేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement