Tuesday, April 30, 2024

పాలమూరు వాసికి అంతర్జాతీయ యువశాస్త్రవేత్త పురస్కారం

ఎయిడ్స్ వాధితో బాధపడుతున్న రోగుల చికిత్స సులభతరం చేసేందుకు చేసిన పరిశోధనకు మహబూబ్‌నగర్ జిల్లా వాసి డాక్టర్ వంశీకృష్ణ జోగిరాజుకు అంతర్జాతీయ యువ శాస్త్రవేత్త పురస్కారం వరించింది. కెనడాలోని మాంట్రియాల్ నగరంలో గతనెల 29 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు 24వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దాదాపు 10వేల మంది ప్రతినిధులు పాల్గొని 2100 పరిశోధనలను ప్రజెంట్ చేశారు. అందులో క్లీనికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ వంశీకృష్ణకు యువశాస్త్రవేత్త అవార్డు దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావు, రమాదేవిల కుమారుడు డాక్టర్ వంశీకృష్ణ అమెరికాలోని GILEAD SCIENCES సంస్ధలో వైరాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

పదవ తరగతి వరకు మహబూబ్‌నగర్ పట్టణంలోని బోధిని హైస్కూల్‌లో చదివిన డాక్టర్ వంశీకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, జేఎన్‌టీయూ హెచ్‌ నుంచి ఎంఫార్మసీ పట్టాపొందారు. న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం వంశీ అమెరికాలోని కాలిఫోర్నియాలో భార్య మౌనికతో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారు రోజుకు ఒకటి నుంచి నాలుగు ట్యాబ్‌లేట్స్‌ వాడుతుంటారు. ప్రస్తుత తన పరిశోధనతో ఒక్క ఇంజక్షన్‌తో ఆరు నెలల వరకు వైరల్‌లోడ్‌ను నియంత్రించగలిగే అవకాశం ఉందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. దీని వల్ల హెచ్‌ఐవీ రోగికి వారి యాంటీ రీట్రోవైరల్ థెరఫీ సులభతరంగా మారే అవకాశాలున్నాయని వివరించారు. తన పరిశోధన ఎయిడ్స్ వ్యాధిగ్రస్దులకు ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉందని వంశీ అన్నారు. తమ కుమారుడికి యువశాస్త్రవేత్త అవార్డు రావటం పట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement