Sunday, April 28, 2024

ఏరియా ఆస్పత్రుల్లో సౌకర్యాలలేమి.. టీఫా టెస్టు ప్రయివేటులోనే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గర్భిణీలకు చేసే టెస్టుల్లో కీలకమైన టీఫా టెస్టు సదుపాయాలు రాష్ట్రంలోని ఏరియా ఆస్పత్రుల్లో కొరవడ్డాయి. చాలా ఏరియా ఆస్పత్రుల్లో టీఫా టెస్టు సదుపాయం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి గర్భిణీలు ప్రయివేటులో రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లించి టెస్టు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గర్భిణీలకు 5 లేదా 6 నెలలో టీఫా టెస్టు నిర్వహిస్తారు. గర్భంలో బిడ్డ ఎలా ఉంది..?, సరైన గ్రోత్‌ ఉందా..?, అన్ని అవయవాలు ఎదుగుతున్నాయా..? తదితర కీలక అంశాలను టీఫా టెస్టు ద్వారా వైద్యులు గుర్తిస్తారు. ఏమైనా లోపాలుంటే తగిన మందులు రాస్తుంటారు. కీలకమైన ఈ టీఫా టెస్టు చేసే ఉపకరణాలు రాష్ట్రంలోని చాలా ఏరియా ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వైద్యులు నిర్ణీత సమయానికి ఆస్పత్రులకు రాకపోతుండడంతో గర్భిణీలు చికిత్స పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓపీలో చికిత్స చేయించుకుని, వైద్యుడు రాసిన పలు టెస్టులు చేయించుకునేందుకు ఒక రోజు, ఆ రిపోర్టులతో డాక్టర్‌కు చూపించుకోవడానికి మరోరోజు పడుతోందని రోగులు చెబుతున్నారు. టెస్టు రిపోర్టులతో మరునాడు ఆస్పత్రికి వస్తే ప్రధాన వైద్యుడు వేలకు రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్బిణీలకు ఉచితంగానే టెస్టులు చేస్తున్న ఆస్పత్రులు… రిపోర్టులు ఇవ్వడానికి మాత్రం 2, 3 రోజులు తిప్పించుకుంటున్నాయి. వైద్యులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గర్భిణీలు వాపోతున్నారు.

రాష్ట్రంలో 54వరకు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలో 15 దాకా వైెద్య విభాగాలు ఉన్నాయి. గైనిక్‌, పీడియాట్రిక్‌, ఆర్థో, డయాలసిస్‌ వంటి 15 ప్రాథమిక వైద్య విభాగాలను ఏరియా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అయితే చాలా ఆస్పత్రుల్లో ఆయా విభాగాల్లో మరీ ముఖ్యంగా గైనకాలజీస్టుల కొరత తీవ్రంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సకాలంలో రాకపోవడంతో ఓపీ క్యూ ఉదయం 11 గంటలకల్లా చాంతాడంతా పెరిగిపోతోంది. గర్భిణీలకు చికిత్స పేరుతో సాధారణ రోగులకు సత్వరమే ఓపీ చికిత్స అందించకుండా వారంపాటు ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏవేవో టెస్టులు రాస్తున్నారని, ఆటెస్టు రిపోర్టు తీసుకుని వచ్చే సరికి వైద్యుడు అందుబాటులో ఉండడం లేదని, దాంతో మరునాడు, మూడో రోజున లేదంటే వచ్చే వారం రావాలని సిబ్బంది చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. ఏదైనా టెస్టు చేయించుకుని వైద్యం పొందాలంటే కనీసం రెండు రోజుల సమయం పడుతోందని రోగులు ఆరోపిస్తున్నారు. ఎక్స్‌ రే టెస్టు అనంతరం ఫిల్మ్‌ను ప్రింట్‌ చేయకుండా వైద్యుడి లేదంటే రోగి మొబైల్‌కు ఫిల్మ్‌ను పంపిస్తున్నారని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement