Tuesday, April 30, 2024

TS : మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ ఛ‌లో మేడిగడ్డ… పిలుపు ఇచ్చిన కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డే అన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ రైతాంగానికి కామధేనువు.. తెలంగాణకు జీవధార కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ దీన్ని పూర్తి చేశారని చెప్పారు. మార్చి 1న ఛ‌లో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే అందులో 3 కుంగిపోయాయని, మూడు పిల్లర్లు కుంగితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో వందల కిలో మీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్నా గతంలో తెలంగాణ ఎడారిగా ఉండేదన్నారు. ‘తలాపున పారుతోంది గోదావరి.. మన చేను, సేలక ఎడారి’ అని పాఠాలు రాశారని గుర్తు చేశారు.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ జలయజ్ఞం చేపట్టిందని.. కానీ అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఎద్దేవా చేశారు. ఆనాడు 52 వేల కోట్ల‌ అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింద‌న్నారు. అప్పట్లో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎండిపోయే పరిస్థితి వచ్చింద‌ని వివ‌రించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్యాయం జరిగిందంటూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ గర్జించిందని గుర్తు చేశారు. కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నా ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదని విమర్శించారు. తమ్మిహట్టి అన్నారు, తట్టెడు మట్టి తీయలేదు.. కనీసం మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోలేదని ధ్వజమెత్తారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో క్రాంటాక్టర్లకు రూ.52 వేల కోట్లు కట్టాబెట్టారని ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ పదేళ్లు టైమ్ పాస్ చేసిందని సీరియస్ అయ్యారు. గోదావరి నీళ్లను తెలంగాణకు మళ్లీంచేందుకు కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేశారని చెప్పారు.

తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పిందని గుర్తు చేశారు. తమ్మడిహట్టి కంటే మేడిగడ్డ వద్దే నీటి లభ్యత ఎక్కువ అని చెప్పిందని.. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ కాబట్టే కాళేశ్వరం ప్రారంభించామని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మించడం కోసం మహారాష్ట్రతో వివాదం ఉన్నా సామరస్యంగా పరిష్కారించామని తెలిపారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదని అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మళ్లీ జీవం వచ్చిందంటే కారణం కాళేశ్వరమేనని, కాళేశ్వరం 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కామధేనువు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement