Sunday, May 5, 2024

బ‌హుజ‌నుల‌పై గులాబీ బాస్ ఫోక‌స్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఉన్న దళిత, బహుజన సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ప్రకాష్‌ అంబేడ్కర్‌ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దళిత, బహుజనుల సమస్యలపై చర్చలకు ప్రకాష్‌ అంబేడ్కర్‌ను ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు. మే నెలలో హైదరాబాద్‌లో చర్చలు జరపనున్నా రని విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశలో దూకుడుగా వెళుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని భావిస్తున్న ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యామ్నా యంగా బీఆర్‌ఎస్‌ని విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నారన్న విషయం తెలి సిందే. ఈ విషయాన్ని పలు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ రాజ్యమేనని కూడా చెప్పారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు నాయకులతో పాటు, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వి రామంగా చర్చలు జరుపుతున్నారు. ఆ దిశలో ఇప్పటికే పార్టీకి అనుబంధంగా జాతీయ స్థాయిలో రైతు సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలో పార్టీని శరవేగంగా విస్తరిస్తున్నారు. త్వరలో అక్కడ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అదే క్రమంలో సామాజిక సంఘాల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. దేశంలో ఎస్సీ జనాభా గత గణాంకాల ప్రకారం 16శాతం అయినప్పటికీ, ప్రస్తుతం 20 శాతానికి పెరిగి ఉంటుందని అంచనా. అదేవిధంగా గిరిజన జనాభా 6శాతమే అని అధికార లెక్కలు చెబుతున్నప్పటికీ వారి జనాభా 8శాతానికి పెరిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీల జనాభా 10శాతానికి పైగా ఉన్నప్పటికీ, ప్రధానంగా దళిత, గిరిజన వర్గాలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే పదికాలాల పాటు ఉంటుందని కేసీఆర్‌ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది . ఒకప్పుడు ఈ వర్గాల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి గంపగుత్తగా కాంగ్రెస్‌ పార్టీకే పడేవి. అందుకే కాంగ్రెస్‌ కూడా దాదాపు ఎక్కువ కాలం కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే, మారిన పరిస్థితుల్లో ఈ వర్గాల ఓట్లు అన్ని పార్టీలకు పడుతున్నాయి.

ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నప్పటికీ గతంలో మాదిరిగా దళిత, గిరిజన వాడలు కంచుకోటలుగా లేవనేది కేసీఆర్‌ అంచనా. అంతేగాక సామాజికంగా అట్టడుగున ఉన్న ఈ వర్గాలు మాట ఇస్తే తప్పరని, నమ్మకంగా ఉంటారని కేసీఆర్‌ నమ్మకం. అందుకే దళిత, గిరిజన సామాజిక వర్గాల అభ్యున్నతికి ఏం చేయాలి? ఏఏ రాష్ట్రాలలో ఈ వర్గాల అవసరాలేంటి? స్వాతంత్య్ర వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ వర్గాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదగకపోవడానికి గల కారణాలేంటి? ఇంకా కొన్ని ప్రాంతాలలో అంటరానితనం, వివక్షలు ఎందుకున్నాయి? తదితర సమస్యలపై ఈవర్గాలకు చెందిన ముఖ్యనేతల సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు.

తాజాగా దళితుల సమస్యలపై ప్రకాష్‌ అంబేడ్కర్‌తో చర్చలు జరపాలని నిర్ణయించారు. దళితుల సంక్షేమంపై చాంపియన్‌గా మారాలనుకుంటున్న కేసీఆర్‌ ఇప్పటికే రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు నామకరణం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకాన్ని చేపట్టి ఒక్కో దళితుడి ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.10 లక్షలు ఆర్థిక సాయమందిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 40లక్షల మందికి ఈ పథకం వర్తింపజేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా 25 లక్షల మందికి ఇస్తామని కూడా కేసీఆర్‌ ప్రకటించారు. టాంక్‌ బండ్‌ వద్ద దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహానికి ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయాలను కేసీఆర్‌ ప్రకటించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనుమడిని కూడా ఆహ్వానించారు. విగ్రహావిష్కరణకు ఒకరోజు ముందే వచ్చిన ప్రకాష్‌ అంబేడ్కర్‌ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో బస చేశారు. కేసీఆర్‌ చెప్పిన అజెండాపై ప్రాథమికంగా చర్చలు కూడా జరిపారని తెలిసింది. మలిదశ చర్చలను వచ్చే నెల నిర్వహించాలని నిర్ణయించారు. కర్ణాటకలో వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలను ప్రకటించనున్నారు. కర్ణాటక ఫలితాల ప్రకటన తర్వాత భేటీ కావాలని, అప్పటికీ దేశంలోని పరిస్థితుల్లో కొన్ని మార్పులు జరగవచ్చని అందుకే కర్ణాటక ఎన్నికల అనంతరం ఇరువురు నేతలు భేటీకి నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement