Saturday, May 18, 2024

జీతాల కోసం కటకట.. ఉద్యోగులకు ఇంకా అందని వేతనాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పేరుకే ధనిక రాష్ట్రం. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఉద్యోగులు, టీచర్లకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సగం నెల కావొస్తున్నా ఇంకా 14 జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జూన్‌ నెల వేతనాలు, పెన్షన్లను విడుదల చేయలేదు. అంతేకాకుండా ఎయిడెడ్‌, మోడల్‌ స్కూల్‌ సిబ్బంది వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ను కూడా ఇంతవరకు విడుదల చేయలేదు.గత రెండేళ్లుగా మొదటి తారీఖున జీతాలు రావటం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు కలగా మారింది. ఈనెల 12వ తారీఖు వరకు 33 జిల్లాల్లో ఇంకా 14 జిల్లాల రాష్ట్ర ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పరిస్థితి సరేసరి. ఒక్కో రోజు కొన్ని జిల్లాల చొప్పున జీతాలు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 11 వరకు 19 జిల్లాలకు జీతాలు జమ చేయాల్సి ఉండగా, మంగళవారం నాడు సిద్ధిపేట, నిర్మల్‌, యాదాద్రి, భువనగిరి, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులకు జీతాలు వేయడంతో ఇంకా 14 జిల్లాలు పెండింగ్‌లో ఉన్నాయి.

రెండేళ్లుగా ఒకటో తారీఖున అందని వేతనాలు…
నెల మొదటి తేదీన గడిచిన నెల వేతనం పొందటం ఉద్యోగుల హక్కు అని టీచర్‌ సంఘాల నేతలు చెప్తున్నారు. గత రెండేళ్లుగా నెల మొదటి పనిదినం నుండి పదో తేదీ మధ్య రొటేషన్‌ పద్ధతిలో రోజు కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమ చేసేవారు. గత మూడు నెలలుగా మాత్రం 12, 15 తేదీల వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జీతం ఎప్పుడు జమ అవుతాయో తెలియని ఆయోమయం నెలకొందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెలలో 14 జిల్లాలకు ఇంకా చెల్లింపులు జరగలేదని టీచర్లు చెప్తున్నారు.


ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు…
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంటి నిర్మాణం కోసమో, పిల్లల చదువుల కోసమో, ఇతరత్ర అవసరాల కోసం తీసుకున్న బ్యాంకు రుణాల ఈఎంఐలు ప్రతి నెల 5, 10 తేదీల్లోగా చెల్లాంచాల్సి ఉంటుంది. గడువు లోపు ఈఎంఐలు కట్టడానికి ఖాతాల్లో డబ్బులేక ఫెనాల్టిdతో కట్టాల్సి వస్తున్నదని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులు కూడా భాగమే కనుక ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ నిర్వహణా ఖర్చుల్లో భాగంగానే చూడాలని అంటున్నారు. కానీ కేవలం ఉద్యోగాల జీతాల కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నట్లు ప్రతినెలా జరుగుతున్న ప్రచారం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసున్నదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌ నాడే ఇవ్వాలి: టీఎస్‌ యూటీఎఫ్‌
నెల మొదటి తేదీనే వేతనాలు, నిర్ణీత గడువులోగా సప్లిమెంటరీ బిల్లులు విడుదల చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి డిమాండ్‌ చేశారు. సమాయానికి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. జూన్‌ నెల జీతాలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చశారు.

ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసిన టీపీటీఎఫ్‌ నేతలు…
జూన్‌ నెల జీతాలు, పెండింగ్‌ బిల్లులను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును టీపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు వై.అశోక్‌కుమార్‌, ముత్యాల రవీందర్‌, అదనపు కార్యదర్శి పి.నాగిరెడ్డిలు కలిసి వినతి పత్రం అందజేశారు. దాంతో రెండు రోజుల్లో అందరికీ జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని వారీకి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement