Sunday, May 12, 2024

స్వచ్ఛ వారోత్సవాలను నిర్వహించాలి : పెద్దపల్లి కలెక్టర్ సంగీత

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో స్వచ్ఛ వారోత్సవాలు పగడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. బుధవారం సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడి వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్య, తాగునీరు వివరాలు తెలుసుకున్నారు.
స్వ‌చ్ఛ‌ గురుకుల కార్యక్రమం కింద చేపట్టిన స్వచ్ఛ‌ కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు అందించే ఆహారంపై అధిక శ్రద్ధ వహించాలని, నాణ్యతతో, వేడివేడిగా ఆహారం అందజేయాలని కలెక్టర్ సూచించారు. సంక్షేమ వసతి గృహంలో ఉన్న డార్మెంటరీ (పడక గది) పరిశుభ్రం చేయాలని, నీటి ట్యాంకును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి, గర్రెపల్లి గ్రామ సర్పంచ్ సుజాత, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement