Sunday, April 28, 2024

KNR: ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి… కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాబోధన జరపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాఠ్యాంశాలకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగి విద్యార్థుల విషయ పరిజ్ఞానం, చదివే, రాసే సామర్ధ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు, చదివే, రాసే సామర్థ్యం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ తక్కువ అటెండెన్స్ ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు రెగ్యులర్ గా వచ్చే విధంగా, హాజరు శాతం మెరుగుపరిచే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో నిబంధన ప్రకారం పేరెంట్, టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ రూమ్ ను పరిశీలించి ప్రతిరోజు విద్యార్థులు కనీసం గంట సమయం గ్రంథాలయంలో గడపాలని, విద్యార్థులు చదవడం అలవర్చుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.రమాదేవి, టీచర్స్ అనిత, రమ్య, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement