Sunday, April 28, 2024

KNR: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలు.. ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి రూరల్‌, జనవరి 5 (ప్రభన్యూస్‌): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్‌, రాంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభల్లో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చిందని, ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు చివరి రోజైన శనివారం వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, పథకాల అమలుపై దళారులు, ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, మిగతా పథకాలను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులున్నా.. అధికారులు పరిష్కరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎంపీడీవో రాజు, తహసిల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎస్సి కార్పొరేషన్‌ ఈడి మధుసూదన్‌ శర్మ, ఎంపీఓ సుదర్శన్‌, ఏపీఎం దివ్య, సర్పంచులు కారంగుల రమేష్‌, కారుపాకల మానస సంపత్‌, కనపర్తి శ్రీలేఖ ప్రభాకర్‌ రావు, ఎంపీటీసీలు రుక్కమ్మ, మిట్టపల్లి వసంత, ఉప సర్పంచ్‌ అర్కుటి సంతోష్‌ కుమార్‌, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement