Tuesday, April 30, 2024

పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి..

సుల్తానాబాద్‌: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వైశ్య భవన్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పేద కుటుంబాల్లో ఆనందం నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఇంటికి ఓ పెద్ద కొడుకులా మారిన కేసీఆర్‌ ఎన్నో పథకాలతో ఆదుకుంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పథకాలను అమలు చేస్తున్నారని, పుట్టిన పాప నుంచి కాటికి కాలు చాచే పండు ముసలి వరకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో మరెన్నో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. మండల వ్యాప్తంగా 88 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించగా ఇందులో కళ్యాణలక్ష్మి 77, షాదీముబారక్‌ ద్వారా 11 చెక్కులు అందించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునిత రమేశ్‌ గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, తహసీల్దార్‌ పాల్‌సింగ్‌తోపాటు మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement