Saturday, May 18, 2024

గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు

సుల్తానాబాద్‌: గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు దోహదపడతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను సుల్తానాబాద్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దాసరి, రామగుండం సీపీ సత్యనారాయణలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతోపాటు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డు కట్ట వేయవచ్చన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇతర దేశాల రౌడీలు, నేరస్తులు బెంబేలెత్తిపోతున్నారని, ఎంత పెద్ద నేరానికి పాల్పడినా కొన్ని గంటల్లోనే చేధిస్తున్నామని, ఇందుకు సీసీ కెమెరాలే కీలకమవుతున్నాయన్నారు. 100 మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరాల ద్వారా సాధ్యమవుతుందని, గ్రామాన్ని సస్య శ్యామలంగా, ప్రశాంతంగా మార్చుకునేందుకు స్వశక్తి సంఘాలు, యువత, ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అలాగే గ్రామాన్ని పరిరక్షించుకోవాలని వారు కోరారు. అలాగే పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి ఎలాంటి అంటు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్తులకు ఇసుక ట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి శాండ్‌ టాక్సీలో చోటు కల్పిస్తామని, అవసరమైతే ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. గ్రామంలో మహిళా సంఘ భవనం, గ్రామపంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించి గ్రామాభివృద్ధికి పాటు పడతామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సింగిల్‌ విండో చైర్మన్లు సందీప్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, సర్పంచ్‌ బండారి రమేశ్‌, ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్‌, నాయకులు మొగులూరి అంజయ్య గౌడ్‌, డీసీపీ రవీందర్‌, ఏసీపీ నితికా పంత్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ ఉపేందర్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement