Tuesday, May 7, 2024

TS: కరీంనగర్-తిరుపతి రైలు వారానికి ఇక 4 రోజులు.. బండి సంజయ్

కరీంనగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణీకులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున… వారానికి 4 రోజులపాటు పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వే లేన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి త్వరగా ఫైనల్ లోకేషన్ సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్ లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.

అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వెళ్లే గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్(12590-89), యశ్వంతపూర్ నుండి గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ (12592-91 ), హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుండి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ (12791-92), చెన్నై నుండి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్ ప్రెస్ (12656-55) రైళ్లను జమ్మికుంట స్టేషన్ లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. వెంటనే స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంట స్టేషన్ లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్ల్వే లేన్ కు సంబందించి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజల నుండి అనేక ఫిర్యాదులొస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని 11ఎ, 16ఎ, 26, 101, 123ఏ, 134ఏ, 140ఏ, 164, 175ఏ, 775 ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) డ్రైనేజీలను మంజూరు చేయాలని బండి సంజయ్ కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైల్వే మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement