Tuesday, April 30, 2024

నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం – ఆర్దిక శాఖ‌పై పెనుభారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నది. అంచనా వ్యయం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. గతంలో జలయజ్ఞం పేరుతో శంకుస్థాపనలు జరుపుకున్న ప్రాజెక్టులు పూర్తికాక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్లతరబడి అనుమతులు రాకపోవడంతో సీఎం కేసీఆర్‌ రీఇంజనీరింగ్‌ చేసి నిధులు సమకూర్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జలశక్తి, వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, కేఆర్‌ఎంబీ అనుమతుల జాప్యంతో వందశాతం అంచనా వ్యయాలు దాటిపోతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు సమకూరుస్తున్నప్పటికీ మోడీ సర్కార్‌ అనుతులు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. మోడీ సర్కార్‌పై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పనులు పూర్తి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభించడంలో ఆలస్యమవుతోంది. దీంతో వేలాది కోట్ల ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపై పడుతున్నది. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం సాగునీటి రంగానికి కేటాయించాల్సి వస్తోంది. ప్రజల దృష్టిలో తెలంగాణ సర్కార్‌ను పలుచన చేస్తూ బీజేపీ పాగావేసేందుకు ఈ ఎత్తుగడలను పాటిస్తూ మహాకవి శ్రీశ్రీ అన్నట్లు కుడి ఎడమల దగా.. దగా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం వాటి గురించి ఆలోచించడం లేదు. కోర్టు కేసులు, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు, నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు, విపక్షాల ఆరోపణలను సాకుగా చూపుతూ అలవి కాని ఆలస్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై వివిధ ప్రాజెక్టుల వివరాలను సమర్పించినప్పటికీ అనుమతుల నిరాకరణతో పనులు ఆగిపోవడంతో పాటు అంచనా వ్యయం పెరుగుతోంది. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిలువరించడంతో వేల కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతున్నది. ప్రాజెక్టు పూర్తి అయ్యేనాటికి అంచనా వ్యయం 75శాతం పెరిగే ప్రమాదం ఉందని జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక భారంగా అంచనా వ్యయం
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణకు సాగునీటి రంగంలో సహాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందడం లేదు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ఆరోపణలను సాకుగా చూపుతూ ఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో రోజురోజుకు అంచనా వ్యయం దాటిపోతున్నది. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులపై జీఎస్టీ 2శాతం నుంచి 18శాతానికి పెంచడంతో ప్రాజెక్టుల వ్యయం పెరగడంతో ఎప్పటికప్పుడు అంచనాలను సవరిస్తూ కేంద్రానికి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర అనుమతులు లేకపోవడంతో ఉదాహరణకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.5600 కోట్ల 57 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.5860.86 కోట్లకు చేరుకుంది. నెట్టెంపాడు, రాజోలిబండ ఆధునీకరణ, నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ అంచనా వ్యయాలు 30శాతం పెరిగిపోయాయి. ఎల్‌టి. బయ్యారం అంచనా వ్యయం రూ.10.96 కోట్ల నుంచి రూ.13.04 కోట్లకు చేరుకుంది. గుండ్ల వాగు పరిస్థితి ఇదే విధంగా ఉంది. కొమురంభీం ప్రాజెక్టు రూ.274కోట్ల 14 లక్షలతో ప్రారంభించి రూ.882.36 కోట్లతో పూర్తి చేయాల్సి వచ్చింది. 2006లో జలయజ్ఞంలో రూ.7.34 కోట్ల అంచనావ్యంతో శంకుస్థాపన చేసుకున్న మత్తడి వాగు రూ.65 కోట్ల 16 లక్షలతో పూర్తి చేసుకోవల్సి వచ్చింది. దిండి నీటికేటాయింపుల వివాదాన్ని కేంద్రం పరిష్కరించకపోవడంతో రూ.19.87 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమై రూ.22 కోట్ల 4లక్షలకు చేరుకున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో 30శాతం వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌ ఆధునీకరణకు రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం చిక్కుముడి వేసింది. భక్తరామదాసు అంచనా వ్యయం పెరిగి ప్రస్తుతం రూ.36 కోట్లకు చేరింది.

నీటి కేటాయింపులు ఉన్నా అభ్యంతరాలు
నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలు అనుమతులు నిరాకరించడంతో చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం వేలాది కోట్లు పెరిగిపోయింది. ఇచ్చంపల్లి 85 టీఎంసీలు, రాజీవ్‌సాగర్‌ 16టీఎంసీలు, దేవాదుల 38 టీఎంసీలు. సీతారామప్రాజెక్టు -తుపాకుల గూడెం బరాజ్‌ 70 టీఎంసీలు, దేవాదుల ఎత్తిపోతల పథకం 38 టీఎంసీలు, ముక్తేశ్వర 45టీఎంసీలు, మోడీకుంట వాగు 2.14 టీఎంసీల నీటి అనుమతులతో ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే సీడబ్ల్యూసీ అభ్యంతరాలతో అవరోధాలు సష్టిస్తున్నది.

- Advertisement -

ఆందోళనకరంగా అంచనా వ్యయం
గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరులో జాప్యం కారణంగా ఖర్చులు, అంచనా వ్యయాలు దాటిపోతున్నాయని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి ప్రభుత్వం తీసుకువెళ్లిందని చెప్పారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. కృష్ణా నీటి వాటా పెంపుకోసం ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement