Thursday, April 25, 2024

అడవుల్లో అక్రమార్కుల వీరంగం : ప‌ట్టించుకోని అధికారులు

కుల్కచర్ల : మండలంలోని అడవులు అక్రమార్కులచేతుల్లో అంతరించిపోతున్నాయి. అడ్డదారుల్లో సంపాదించే అక్రమార్కులకు అడవులు ఆసరాగా మారుతున్నాయి. అందినకాడికి పుచ్చుకుని, ఆమ్యామ్యాలకు అలవాటుపడ్డ అధికారగణం అక్రమ కలప ఆచూకీ దొరికినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అధికారుల ముందే ఇటుక బట్టిల్లో కలప ఆవిరై పోతున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతికి ప్రాణ సమానంగా ఉన్న అడవులను, కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించి ఒకపక్క చెట్లు పెంచడానికి ఖ‌ర్చు చేస్తుంటే అధికారులకు మాత్రం ఏమీ పట్టకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారుల అండ చూసుకొని, పగలంతా చెట్లను నరికి వేస్తూ రాత్రి వేళల్లో అక్రమంగా నరికిన కలపను ఇటుక బట్టీల్లో తగలబెట్ట‌డానికి తరలిస్తున్నారు. అక్రమార్కుల చేతుల్లో అడవులు అధికారుల కళ్లముందే కరిగిపోతున్నా అందినకాడికి పుచ్చుకున్న పాపానికి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

అడవుల్లో అక్రమార్కులు చెట్లు నరికే సమయాన అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా మండల పరిధిలోని కుల్కచర్ల పరిసరప్రాంతాలు, అంతారం, పుట్ట పహాడ్, గండి చెరువు, రామ్ రెడ్డి పల్లి, ఘనపూర్ గేట్, తదితర గ్రామాల పరిసరాల్లో ప్రాంతాలలో తయారవుతున్నా ఇటుక బట్టీలకు కలప తరలిపోతుంది. రామ్ రెడ్డి పల్లి, ఘనపూర్ గేట్, తదితర గ్రామాల పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న ఇటుక బట్టీలకు కలప తరలిపోతుంది. ప్రతిరోజూ 10 నుండి 15 ట్రాక్టర్ల వరకు అడవుల నుండి అక్రమ కలప తరలిపోతున్నా… అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు తప్ప, ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ అక్రమ సీజన్ ప్రతి ఏటా డిసెంబర్ మొదటి వారం నుండి జూన్ నెల చివరి తేదీ వరకు సుమారు ఎనిమిది నెలల కాలం పాటు అక్రమ దందా కొనసాగడంతో మండలంలోని అడవులు పూర్తిగా అంతరించే ప్రమాదముంద‌ని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన చర్యలు చేపట్టాలని, అడవులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement