Wednesday, May 15, 2024

ఇష్టంతో కష్టపడితేనే ఉద్యోగాలు సాధించ‌గ‌లం.. కమిషనర్ యోగితా రాణా

ఇష్టంతో కష్టపడి చదివితేనే ఉద్యోగాలను సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగిత రాణా అన్నారు. ఉద్యోగాల సాధన కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీస్ శిక్షణ కేంద్రం కరీంనగర్ లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు కొనసాగుతున్న ఉచిత శిక్షణను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలువాలన్నారు. పనులను వాయిదా వేస్తూ పోతే జీవితంలో ఏది సాధించలేమని చెప్పారు. ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు.

ఆకాశమే హద్దుగా ముందుకు సాగితే లక్ష్యాలను సాధించవచ్చని యోగితా రాణా పేర్కొన్నారు. పోలీసు శిక్షణ కేంద్రంలోనే ఈ ఉచిత శిక్షణ శిబిరం కొనసాగడం వల్ల ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెంపొందుతుందని చెప్పారు. ఈ శిబిరంలో శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థి క్రమశిక్షణతో ఉద్యోగాలను సాధించాలని కోరారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కష్టపడి చదవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ దేహదారుఢ్యానికి ప్రాధాన్యతనిస్తూ శ్రద్ధాసక్తులతో చదవాలన్నారు. ఇంతటి సుహృద్భావమైన వాతావరణంలో ఉచిత శిక్షణ కొనసాగడం అదృష్టంగా భావించాలని తెలిపారు. త్వరలో వారధి యాప్ ను ప్రారంభించి వారధి సొసైటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ కయిషనర్ వి. సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, సిటిసి ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్, అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement