Monday, May 6, 2024

సోనూసూద్‌ను సత్కరించిన మంత్రి కేటీఆర్

తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్ మంగళవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు.

ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్ ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణాకు ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనూసూద్ అన్నారు. ఈ సమావేశం అనంతరం సోనూసూద్‌కు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి ఒక మెమొంటోను మంత్రి కేటీఆర్ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement