Saturday, April 27, 2024

భాగ్యనగరానికి ఉత్తరాన రియల్‌ ఊపు.. ఫోకస్‌ పెంచిన క్రెడాయ్‌, భారీగా ప్రాజెక్టుల లాంచ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాలసీల ఫలితంగా రాష్ట్ర రాజధాని నలువైపులా రియల్‌ఎస్టేట్‌ వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు నగరానికి పశ్చిమవైపు మాత్రమే విస్తరించి ఉన్న ఐటీ కంపెనీల వల్ల ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ భారీగా వృద్ధి చెందింది. ఈ పరిస్థితి మారి నగరంలో నలువైపులా రియల్‌ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగం వృద్ధి వికేంద్రీకరణ జరిగి ఆ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగాలని రాష్ట్ర ఐటీ శాఖ గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌(గ్రిడ్‌) పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ కి తగ్గట్లుగానే ప్రభుత్వం రాజధాని నగర ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఐటీ రంగం విస్తరించడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది.

దీనిలో భాగంగా హైదరాబాద్‌ ఉత్తరం వైపు ఐటీ, పరిశ్రమల శాఖ అభివృద్ధి చేస్తున్న ఐటీ, పారిశ్రామిక పార్కుల వల్ల అటు వైపు రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి వేగవంతమవుతోంది. దీంతో ఇక్కడ దృష్టి కేంద్రీకరించాలని హైదరాబాద్‌ నిర్మాణదారుల సంఘం(క్రెడాయ్‌ హైదరాబాద్‌) నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా రెండు రోజుల పాటు కొంపల్లిలో రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నగర ఉత్తర ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై స్టేక్‌ హోల్డర్లతో చర్చించనున్నారు.

గేట్‌వే ఐటీ పార్కు, జీనోమ్‌ వ్యాలీతో ఊపు…

ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీలో భాగంగా కొంపల్లి ప్రాంతంలో గేట్‌ వే పేరుతో నిర్మించనున్న భారీ ఐటీ పార్కు, లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా పేరొందిన జీనోమ్‌ వ్యాలీ విస్తరణతో హైదరాబాద్‌ ఉత్తర ప్రాంతలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు వచ్చినట్లు క్రెడాయ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల వద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీ వృద్ధి సాధించడానికి దోహదం చేస్తున్నాయని పలు నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

గేట్‌ వే ఐటీ పార్కు నిర్మాణం పూర్తయి అక్కడ కార్యకలాపాలు ప్రారంభమై న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని క్రెడాయ్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మోస్తరుగా వృద్ధి చెందిన ఫార్మా రంగం ప్రభావంతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, త్వరలో ఇవి రెట్టింపవుతాయని క్రెడాయ్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement