Tuesday, April 30, 2024

Hyd | టౌన్‌ ప్లానింగ్‌లో పదోన్నతులు.. జీహెచ్‌ఎంసీ సీసీపీగా రాజేంద్రప్రసాద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పురపాలక శాఖలో అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టౌన్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో 11 మంది అధికారుల్లో కొందరికి పదోన్నతి కల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌ రెడ్డిని డీటీసీపీ డైరెక్టర్‌గా నియమించింది. దేవేందర్‌ రెడ్డి స్థానంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎం. రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ను జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌గా నియమించారు. ప్రస్తుతం డీటీసీపీ డైరెక్టర్‌గా ఉన్న కే. విద్యాధర్‌ను హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఈ విభాగానికి ప్రస్తుతం అదనపు బాధ్యతలు చూస్తున్న ఎస్‌. బాలకృష్ణను రిలీవ్‌ చేశారు. రెరా సెక్రటరీగా బాధ్యతలను అప్పగించారు. హెచ్‌ఎండీఏలో డైరెక్టర్‌ 2గా విధులు నిర్వహిస్తున్న శివ శరణప్పను పురపాలక శాఖ ప్లానింగ్‌ విభాగానికి డైరెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీలోని హౌజ్‌ నెంబరింగ్‌ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్న కే. శ్రీనివాస్‌ను హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ 2గా నియమిస్తూ ఉత్తర్వులో వెల్లడించారు. టౌన్‌ ప్లానింగ్‌లో అడిషనల్‌ డైరెక్టర్‌ ఎం. భవానీ రాణికి ప్లానింగ్‌ విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించడంతో పాటు బదిలీ చేశారు.

టౌన్‌ ప్లానింగ్‌లో అడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్న బీఎస్‌ చంద్రికను వీటీఏడీఏకు చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. మరో అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ను పదోన్నతి కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌గా జీవోలో స్పష్టం చేశారు. గ్రేటర్‌ వరంగల్‌లోని అడిషనల్‌ డైరెక్టర్‌ వెంకన్నను డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. టౌన్‌ ప్లానింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కే. గంగాధర్‌కు పదోన్నతి కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌గా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement