Wednesday, December 4, 2024

స‌ర్పంచ్ కి ఇస్తే స‌రిపోతదా…. మంత్రి మాటేంది…

క‌లెక్టర్‌కు ఇచ్చి పొట్టుపొట్టు చేస్తా
50ఎకరాల వెంచర్‌పై రియల్టర్‌కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ్‌
వైరల్‌గా మారిన ఆడియో టేప్‌
గతంలోనూ అనేక ఆరోపణలు.. కబ్జాలు, బెదిరింపులు, కేసులు
భగ్గుమన్న విపక్షాలు.. మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్

హైదరాబాద్‌, ”ఏమయ్యా మహేందర్‌.. 50 ఎకరాల వెంచర్‌ నడుస్తంది. సర్పంచ్‌కు ఇస్తే సరిపోతదా. కలెక్టర్‌కు ఇచ్చి వాడిని పొట్టుపొట్టు చేస్త. వాడిని పట్టుకురా. ఈడ ఎమ్మెల్యే ఉన్నడు.. మంత్రి ఉన్నడు. వాడు ఎవడు.. ఎందుకు కలుస్తలేడు. మంత్రిని కలువమని బిచ్చం అడుగుతవా పోయి. పొట్టుపొట్టుచేస్తం. వాడిని ఎపుడు తెస్తవు. తెచ్చేదాకా వెంచర్‌ ఆపమని చెప్పు” అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి శామీర్‌పేటకు ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రి మల్లారెడ్డి మీద ఆరోపణలకు సంబంధించిన ఆడియో మంగళవారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. వెంచర్‌కు సంబంధించి తనను కలవలేదని.. సర్పంచ్‌కే ఇస్తరా.. మాకు ఇవ్వరా అంటూ రియల్టర్‌ను బెదిరిస్తున్నట్లుగా ఆడియోలో ఉంది. గతంలో కూడా మల్లారెడ్డిపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్యామల అనే మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాక రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలతో ఆయన మీద దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. మంత్రి మల్లారెడ్డి తరచూ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాడు. కబ్జా ఆరోపణలు, రియల్‌దందాలకు సంబంధించిన ఆరోపణలపై సామాజిక మాధ్యమాల్లో పలు ఆడియోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి రియల్టర్‌కు ఫోన్‌ చేసిన వ్యవహారం, ఆడియోటేప్‌కు సంబంధించి విపక్షాలు.. ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మల్లా రెడ్డిని వెంటనే పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. మల్లారెడ్డి వ్యవహారం, తాజా ఆరోపణలపై సీఎంవో వర్గాలు ఆరా తీశాయి. మల్లారెడ్డి వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని.. విపక్షాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యూహంతో ఉన్నాయి.
వివాదాలకు కేరాఫ్‌
మంత్రి మల్లారెడ్డిని ఆదినుండీ వివాదాలు వైఫైలా చుట్టు ముడుతున్నాయి. తన కాలేజీల కోసం చెరువు అలుగు ఆక్రమించారని, యూనివర్శిటీ కోసం ప్రభుత్వ స్థలాన్ని ఆక్ర మించారని, ప్రహరీ కోసం ప్రైవేట్‌ వ్యక్తుల స్ధలం ఆక్రమించి బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలున్నాయి. మైసమ్మ గూడ వద్ద ఆక్రమణ దృశ్యాలు స్పష్టంగా ఉన్నతా ధికారులు రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రధా నంగా భూ సెటిల్‌మెంట్లకు అడ్డాగా చేసుకున్నారని, మేడ్చల్‌ జి ల్లాలో అధికారులను, రియల్టర్లను భయభ్రాం తులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు విపక్షాల నుండి వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక అందించినట్లు తెలిసింది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరా రంలో తన స్థలం ఆక్రమించారని శ్యామలదేవి అనే మహిళ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన మంత్రి బంధువు పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడు తున్నారని, పలు భూ వివా దాల్లో తలదూరుస్తున్నారన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నా యి. దీనిపై పార్టీ అధినేతకు కూడా ఫిర్యాదు వెళ్ళినట్లు తెలిసింది.
మల్లారెడ్డిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌
మంత్రి మల్లారెడ్డిపై కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మల్లారెడ్డి భూ అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో దొరికినా అతనిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలి. మంత్రి హోదాలో ఉండి తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి దొంగకాలేజీలు నడుపుతూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న మల్లారెడ్డిపై ఎందుకు చర్య తీసుకోరు? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో తనకు కమిషన్‌ కావాలని అడిగినట్లు స్పష్టంగా ఆడియో ఆధారాలతో సహా బయటపడ్డా చర్యలు లేవు. మంత్రిగా ఉన్న వ్యక్తి డబ్బుకోసం బ్లాక్‌ మెయిల్‌ చేయడం సిగ్గుచేటు. ఒక్క నిమిషం కూడా ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదు.
మల్లారెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: కృష్ణసాగర్‌ రావు, బీజేపీ అధికారప్రతినిధి
రియల్టర్‌ను డబ్బుకోసం బెదిరించి అడ్డంగా దొరికిన మంత్రి మల్లారెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలి. మంత్రిగా ఉండి కబ్జాలు, బెదిరింపులు ఏంటి? అవినీతికి పాల్పడితే కుటుంబసభ్యులనే క్షమించనని ముఖ్యమంత్రి చెప్పాడు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ మల్లారెడ్డిని అరక్షణం కూడా పదవిలో ఉంచకుండా తొలగించి మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే అవినీతి, బ్లాక్‌ మెయిల్‌ మంత్రిని తొలగించాలని బీజేపీ ఆధ్యర్యంలో ఆందోళనలకు దిగుతాం. ఆడియోటేప్‌ పక్కా ఒరిజినల్‌.
ఆ ఆడియో నాదికాదు: మంత్రి మల్లారెడ్డి
”నేను ఎవరితో మాట్లాడలేదు. నాకు ఒకరిని బెదిరిం చాల్సిన అవసరం లేదు. నాకు డబ్బులు అవసరం లేదు. శామీర్‌పేట వెంచర్‌ విషయంలో ఆడియో నాది కాదు. ఎవరో మిమిక్రీ ఆర్టిస్టులు చేసి ఉండొచ్చు. అది నాది అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఇది ఎవరు పుట్టించిండ్రు. ఎట్ల వైరలయింది అని మా టీమ్‌ ఆరా తీస్తోంది” అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆడియోటేప్‌ మంగళవారం వైరల్‌ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement