Thursday, April 25, 2024

తొలి తెలుగు సీజేఐ ఎవరో మీకు తెలుసా?

విజయవాడ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపడుతున్న తెలుగు వారిలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రెండోవారు. గతంలో 9వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్యకాలంలో సేవలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 1902 జులై 15న ఓ న్యాయవాద కుటుంబంలో జన్మించిన జస్టిస్‌ కోకా సుబ్బారావు ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ, మద్రాస్‌ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద జూనియర్‌గా పనిచేసిన తన మామ పి.వెంకట రమణారావు నాయుడి వద్ద న్యాయవాదిగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. తర్వాత డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా కొన్నాళ్లు బాపట్లలో పనిచేశారు. తర్వాత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తన బావ పీవీ రాజమన్నార్‌తో కలిసి మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు.

1948లో జస్టిస్‌ కోకా సుబ్బారావు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1953 అక్టోబరు 1న మద్రాస్‌ నుంచి ఆంధ్రప్రాంతం విడిపోయిన తర్వాత ప్రకాశం పంతులు ఒత్తిడి మేరకు 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పాటు కోసం కోకా సుబ్బారావు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. తర్వాత అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1954లో తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత తొలి కులపతిగా పనిచేశారు. 1954 జులై 5 నుంచి 1956 అక్టోబరు వరకు గుంటూరు కేంద్రంగా పనిచేసిన ఆంధ్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆరోజు నుంచి 1958 జనవరి వరకు సమైక్యాంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 1958లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1966 జూన్‌ 30న సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1967 ఏప్రిల్‌ 11న పదవీ విరమణ చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ నిలిచారు. 16వ ప్రధాన న్యాయమూర్తిగా 1978 ఫిబ్రవరి 22న బాధ్యతలు చేపట్టిన ఆయన 1985 జులై 11 వరకు 2,696 రోజులు సేవలందించారు. అలహాబాద్‌ హైకోర్టు నుంచి వచ్చిన జస్టిస్‌ కమల్‌ నారాయణ్‌సింగ్‌ కేవలం 17 రోజులు మాత్రమే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement