Tuesday, May 7, 2024

HYD: మణిపూర్ దోషులను ఉరితీయాలి.. సునీత రావు

తార్నాక: మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించడమే కాకుండా పశువుల్లా పంట పొలాల్లో గ్యాంగ్ రేప్ చేసిన దోషులను ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది. ఈసందర్భంగా సునీత రావు మాట్లాడుతూ… ఈ దుర్ఘటన అందరినీ చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అన్ని దళిత, మహిళా సంఘాలు ఈ సంఘటనపై ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అందరూ చూస్తుండగానే మహిళను నగ్నంగా చేసి ఊరేగించడం చుట్టుపక్కల వారు చూస్తూ వినోదించడం మానవ జాతికి సిగ్గుచేటన్నారు.

ఇంతటి ఘోరమైన సంఘటన జరిగితే ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఆపాలని, అన్యాయం, అమానుషం అని అనకుండా ఉత్సవ విగ్రహాలుగా చూస్తూ పైశాచిక ఆనందం వ్యక్తం చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన మన సమాజానికి మానవ జాతికి మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దేశంలో మహిళలకు రక్షణ భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. రెండు నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న సంఘటనకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పార్లమెంటు దద్దరిల్లేలా విపక్షాలు గొంతు చించుకుని మణిపూర్ సంఘటన అక్కడ జరుగుతున్న ధారుణ మారణ కాండలపై జరుగుతున్న పరిణామాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం మనందరికీ తెలిసిందేనన్నారు. ఈ సంఘటన జరిగి 79 రోజులు అయినా ప్రధానమంత్రికి చీమ కూడా కుట్టినట్టుగా లేదని ఎద్దేవా చేశారు. మణిపూర్ లో ఆదివాసి మహిళలకు వెంటనే తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికార దాహంతో ఇలా వ్యవహరించడం క్షమించరాని నేరమన్నారు. ఈ సంఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకోవాలని నీలం పద్మ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.


మానవ జాతి తలదించుకునేలా జరిగిన ఇలాంటి భయంకరమైన సంఘటన పట్ల మహిళలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మణిపూర్ గిరిజనులపై, ముఖ్యంగా మహిళలపై ఇటువంటి అనాగరిక హేయమైన చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మహిళా కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నామన్నారు. భారత న్యాయవ్యవస్థ ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని మనవి చేశారు. వీరికి అత్యంత కఠిన శిక్షలను వేయాలని మహిళా కాంగ్రెస్ తరపున సాటి మహిళలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఈ కవిత బ్లాక్, అధ్యక్షురాలు శుభానబేగం, మండల, పట్టణ ప్రెసిడెంట్ లు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement