Sunday, December 8, 2024

క్లీన్ ఎనర్జీ దిశగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్

తన రెండో దశ 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో క్లీన్ ఎనర్జీ దిశగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL) మరో మైలురాయిని చేరుకుంది. దీనితో GHIAL యొక్క మొత్తం సోలార్ విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగింది. తన సొంత వినియోగం కోసం జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2015 లో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించింది.

మొత్తం 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 45 ఎకరాల విస్తీర్ణంలో 30 వేలకు పైగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు సౌర ప్లాంట్లు అధునాతన ABB సెంట్రల్ ఇన్వర్టర్లు, పాలీ క్టిస్టలీన్ పీవీ ప్యానల్స్  కలిగి ఉన్నాయి. ఇవి మోనో క్టిస్టలీన్ సోలార్ పీవీ ప్యానల్స్ కంటే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ అదనపు సోలార్ పవర్ కారణంగా, హైదరాబాద్ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కొంటున్న విద్యుత్‌లో ఏడాదికి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ తగ్గుతుంది. తద్వారా నెలకు 90 లక్షల రూపాయలు ఆదా అవుతుంది. ఈ సౌర విద్యుత్ ఉత్పత్తితో హైదరాబాద్ విమానాశ్రయం యొక్క విద్యుత్ అవసరాలు దాదాపు 50% తీరుతాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ లో సుమారు 28 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది, ఇది 1.4 లక్షల పూర్తిగా పెరిగిన చెట్లకు సమానం.

‘‘హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హరిత, పునరుత్పాదక ఇంధనానికి కట్టుబడి ఉంది. సుస్థిరమైన విమానాశ్రయ ఆపరేటర్‌గా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మేము అనేక కార్యక్రమాలను ప్రారంభించాము. ACI (విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్) సభ్య విమానాశ్రయంగా, మేము 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించడానికి కట్టుబడి, ఆ దిశగా మా వంతు కృషి చేస్తున్నాము’’ అని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సిఇఒ ప్రదీప్ పణికర్ అన్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన సామర్థ్య రంగంలో మార్గదర్శకత్వం వహిస్తూ, పునరుత్పాదక ఇంధన వినియోగానికి మద్దతు పలుకుతోంది. GHIAL తన విద్యుత్ పొదుపు కార్యక్రమాల వల్ల వివిధ వేదికలపై గుర్తింపు పొందింది. 2014, 2015, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పలు అవార్డులు సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement