Tuesday, May 7, 2024

పోడు భూముల సమన్వయ కమిటీ సమావేశాలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, అటవీశాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలు వచ్చే నెల 21తేదీ వరకు జిల్లా స్థాయిలో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హైకోర్టు ఆదేశించింది. ఈ సమన్వయ కమిటీల్లో జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రాతినిద్యం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటీషనర్ల తరుపు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌, రవికుమార్‌లు పిటీషన్లు వేశారు. పోడు భూములపై హక్కుల నిర్ధారణ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల ప్రమేయం రాజ్యాంగవిరుద్ధమని, వీరివల్ల పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోగే పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని పిటీషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల హెక్టార్లలోని పోడు భూములపై అర్హులకు హక్కులను కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ కోర్టుకు చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ఈ కేసు విచారణను అక్టోబరు 21తేదీకి వాయిదా వేసింది. ఆలోపు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు నిర్వహించే సమావేశాలను ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement