Sunday, May 5, 2024

ఎమ్మెల్యే అంటే సతీష్ బాబులా ఉండాలి- మంత్రి హరీష్ రావు

హుస్నాబాద్, సెప్టెంబర్ 13 : “ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలి సతీష్ బాబు లాగా ఉండాలి. మంచి శాసనసభ్యులు.. నాకు మిత్రుడు. అత్యంత ఆత్మీయుడు” అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని మీర్జాపూర్ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సభ జరిగింది. ఈ సభను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాష్, సిద్ధిపేట, హనుమకొండ జెడ్పి చైర్మన్లు రోజా రాధాకృష్ణ శర్మ, డా. మారేపల్లి సుధీర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా హరీష్ రావు రాజ్యసభ సభ్యులు కెప్టెన్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ల కుటుంబంపై ప్రశంసలు కురిపించారు.

“ఈరోజు తెలంగాణ వచ్చింది.. మంత్రులం అయ్యాం.. కానీ ఏమీ లేని నాడు.. 2001లో గులాబీ జెండా పుట్టిన నాడు.. టిఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాలంటే అందరూ భయపడే వాళ్ళు. టిఆర్ఎస్ వాళ్లకు అన్నం పెట్టాలంటే భయపడే వాళ్ళు.. టిఆర్ఎస్ వాళ్ళని ఇంట్లో రానివ్వాలంటే భయపడే వాళ్ళు.. ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారో.. అని భయపడే వాళ్ళు.” అని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. “ఉద్యమ సమయంలో.. ఉత్తర తెలంగాణలో మా అడ్డ అంటే మా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇల్లు.. కెసిఆర్ ఎప్పుడు వరంగల్ కు వెళ్లిన.. ఆనాడు ఉద్యమంలో వెళ్లినా.. నేడు ముఖ్యమంత్రిగా వెళ్లినా… కెసిఆర్ కారు నేరుగా వెళ్లి ఆగేది ఎక్కడ అంటే అది కెప్టెన్ గారి ఇంటి వద్ద..!” అని ఉద్వేగంగా అన్నారు. “ఆనాడు ఉద్యమంలో పరకాల స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికలు వచ్చినా.. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో.. ఉద్యమ సందర్భాల్లో.. మేము ఎన్నిసార్లు వెళ్లినా మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన.. ఆతిథ్యం ఇచ్చిన గొప్ప ఇల్లు.. కెప్టెన్ ఇల్లు” అని అన్నారు. “ఇవాళ ప్రభుత్వం వచ్చింది.. చాలామంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఆరోజు ఎవరున్నారు? తెలంగాణ వస్తదో రాదో అని తెలియని నాడు కూడా తెలంగాణ కోసం గట్టిగా నిలబడిన మనసున్న కుటుంబం.. కెప్టెన్ గారి కుటుంబం సతీష్ గారి కుటుంబం” అని అన్నారు. “వారి ఇంటికి వెళ్తే వారి పిల్లలు, భార్య. అమ్మ అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు.. ఆ రోజుల్లో.. అది కొండంత బలాన్ని ఇచ్చింది.. అందుకే చెప్పాను చాలా ఉత్తమమైన శాసనసభ్యులు సతీష్ అని” అని హరీష్ రావు వివరించారు.

“కెప్టెన్ గారితో నేను కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశాను. ఆరోజు తెలంగాణ ఇస్తాం అంటే కేబినెట్లో చేరాం.. ఢిల్లీ నుండి కెసిఆర్ ఫోన్ చేసిన వెంటనే అరగంటలో కెప్టెన్ తో పాటు.. ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మేము అప్పటికప్పుడు రాజీనామా చేసాం” అని గుర్తు చేసుకున్నారు. “సతీష్ కుమార్ ది చీమకు కూడా హానిచేయని మనస్తత్వం. చేతనైన సహాయం చేసే గుణం. ఇంటికి ఎవరైనా వస్తే అన్నం తిన్నావా? అని అడిగిన తర్వాతే.. పనిచేసే తత్వం.. ఎవరు వెళ్లిన కడుపునిండా అన్నం పెడతాడు.. ప్రేమగా మాట్లాడుతాడు… చేతనైన పని చేసి పెడతాడు… ఒక్క రూపాయి లంచమనే పదమే తన జీవితంలో ఎరగని వ్యక్తి… ఆయన తన జీవితంలో ఓ రూపాయి సహాయం చేశాడే తప్ప ఒక రూపాయి తీసుకున్నాడు.. అని ఎవరి నోటా ఇప్పటివరకు వినలేదు. అలాంటి ఉత్తముడైన శాసనసభ్యులు మన సతీష్ బాబు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన సతీష్. పోచమ్మ పండుగకు… బొడ్రాయి ప్రతిష్టకు వస్తారు.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు… అలాంటి మంచి మనిషిని గెలిపించుకొని మళ్లీ మన హుస్నాబాద్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం అని హరీష్ రావు అన్నారు.

“త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకొని కెసిఆర్ తో ప్రారంభం చేసుకుందాం. లక్ష మందితో మళ్లీ బహిరంగ సభ పెట్టుకుందాం. దీనికి అందరూ కార్యకర్తలు సిద్ధం కావాలి. హుస్నాబాద్ అభివృద్ధి గురించి సతీష్ బాబు నిరంతరం తపన పడుతుంటాడు. మొదటిసారి 40వేల మెజారిటీతో గెలిపించారు. రెండోసారి 70 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి లక్ష మెజారిటీతో గెలిపించాలి. గత ఎన్నికల్లో నన్ను లక్ష మెజారిటీతో సిద్దిపేటలో గెలిపించారు ఆ మెజారిటీ ఇక్కడ దాటాలి. సతీష్ బాబు సభ పెట్టగానే 18 వేల మంది ఇక్కడికి వచ్చారు.. సతీష్ బాబు గెలుపును ఎవరు ఆపలేరు” అని హరీష్ రావు స్పష్టం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement