Wednesday, May 15, 2024

క‌రోనాపై పెరుగుతున్న నిర్ల‌క్ష్యం.. మాస్క్ మ‌రిచిండ్రు..!

కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనీస జాగ్రత్తలు తీసుకోని పక్షంలో మళ్లీ విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయాన్ని చాలామంది లైట్‌గా తీసుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్నాం.. మనకేమి కాదులే అనే ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. రెండు డోస్‌లు తీసుకున్నా.. తప్పనిసరిగా మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌నే నిబంధనను పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. గతంలో మాస్కులు లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడేవాళ్లు కారు.
కానీ ప్ర‌స్తుతం మాస్కులు లేకుండా నిర్భయంగా బయట తిరుగుతున్నారు. మాస్కులు లేకుండా వస్తే పోలీసులు పెనాల్టీలు వేస్తారనే భయం కూడా పోయింది. కారణం పోలీసులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో చాలామందిలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిందనే ధీమా కనిపిస్తోంది. ఎవరైనా ముందు జాగ్రత్తలో భాగంగా మాస్కులు వేసుకుంటే వారిని ఓ మాదిరిగా చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో మాస్కులు వేసుకోకపోతే ఓ రకంగా చూసే పరిస్థితి. ఇప్పుడు సీన్‌ రీవర్స్‌గా మారింది. చాలా మంది మాస్కులు వేసుకోక పోవడంతో మిగతా వాళ్లు కూడా ఎందుకు వేసుకోవాలనే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు మాస్కులు వేసుకోని వారి సంఖ్య పెరుగుతోంది. దానికితోడు సామాజిక దూరం కూడా పాటించడం లేదు. ముఖ్యంగా వీకెండ్‌ రోజుల్లో రద్దీ పెరిగిపోయింది. మార్కెట్‌లు, సంతల్లో ఒకరినొకరు తోసుకునే పరిస్థితులు వచ్చాయి. ఆదివారం వచ్చిందంటే చాలు మార్కెట్ల‌లో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు.
వ్యాక్సిన్‌తో పెరిగిన నమ్మకం :
రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనాతో పెద్దగా ఇబ్బంది లేదనే మాట వైద్య ఆరోగ్యశాఖతో పాటు అధికారులు తేల్చి చెబుతుండటంతో జనాలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. రెండు డోసులు తీసుకుంటే మంచిదనే విషయాన్ని చెబుతున్నారు తప్పిస్తే వ్యాక్సిన్లు తీసుకున్నాక మాస్కులు వేసుకోకపోయినా ఇబ్బంది లేదనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పడం లేదు. 70శాతం మంది మాస్కులకు దూరంగా ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చాలావరకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. పట్టణ ప్రాంతాల పరిధిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేశారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలో కొంతమేర వెనుకబడి ఉండటంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఇక్కడ కూడా వందకు వందశాతం మందికి వ్యాక్సిన్లు వేయాలనే పక్కా ప్రణాళికతో వైద్యారోగ్యశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎక్కువ మంది మొదటి డోస్‌ తీసుకోగా సెెకండ్‌ డోస్‌ ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్లు తీసుకున్నందున‌ వీరిలో చాలామంది మాస్కులు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
పాఠశాలల్లో సామాజిక దూరం ఒట్టి మాటే :
కరోనా నిబంధనలకు లోబడి ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కరోనా భయంతో స్కూళ్లకు తక్కువ మంది వచ్చేవాళ్లు. దసరా సెలవుల తరువాత హాజరు శాతం పెరిగింది. ఎక్కువమంది బడులకు హాజరవుతున్నారు. చాలామంది మాస్కులు వేసుకుంటున్నా సామాజిక దూరం మాత్రం పాటించడం లేదు. బల్లాలపై ఒకరి పక్కన మరొకరు కూర్చుకుంటున్నారు. తరగతి గదుల కొరత కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. చిన్న పిల్లల‌కు ఇబ్బందులు వస్తే తట్టుకోవ‌డం కష్టమే. అందుకే స్కూల్‌ పిల్లల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
జిల్లాలో వ్యాక్సినేషన్‌ ఇలా :
జిల్లాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన వ్యక్తులు 11.37 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరించిన అధికారులు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ అన్ని శాఖల అదికారులను పాల్గొనే విధంగా చూస్తున్నారు. ప్రతి ఒక్క‌రూ మొదటి డోసు తీసుకునే విధంగా మోటివేషన్‌ చేస్తూ చర్యలు చేపడుతున్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని అవగాహన కల్పిస్తూ మొదటి డోసు ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10లక్షల 89వేల 738 మందికి వ్యాక్సి నేషన్‌ చేశారు. వీరిలో ఇప్పటి వరకు 8లక్షల 65వేల మందికి పైగా మొదటి డోసు వేశారు.
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ మొదటిడోసు పూర్తయ్యేవిధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో 365కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ వేయడంతో పాటు ఆయా గ్రామాల పరిధిలో ఇంటింటా తిరుగుతూ వ్యాక్సినేషన్‌ వేసుకోని వారిని గుర్తిస్తూ వేస్తున్నారు. వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయితే కరోనా నియంత్రణ సాధ్యమ‌వుతుందని భావించిన యంత్రాంగం.. జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ను చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు 15వేల మందికి పైగా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.
జిల్లాకు డోసుల సరఫరా అనుకూలంగా ఉండడంతో ప్రతీరోజు పెంచుతూ వేస్తున్నారు. మొదటి డోసుతో పాటు 2వ డోసు కూడా కొనసాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో వ్యాక్సినేషన్‌ ఎక్కువ కావడం వల్ల కరోనా తీవ్రత తగ్గడంతో వందశాతం వ్యాక్సినేషన్‌ చేస్తే మరింత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. యుద్ధప్రాతిపాదికన అన్నిశాఖల అధికారులను పాల్గొనే విధంగా చేపడుతూ కలెక్టర్‌ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ప్రతీరోజు కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను మోటివేట్ చేస్తూ వ్యాక్సిన్‌ తీసుకునేవిధంగా చూస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతాల్లో తక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగిందో ఆప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. ప్రతిఒక్కరికీ మొదటి డోసు వేసేవిధంగా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement