Wednesday, May 1, 2024

Breaking: అల్పపీడనం ఎఫెక్ట్.. వరద గుప్పిట్లో చెన్నై.. వెంటాడుతున్న 2015 భయం!

Floods: తమిళనాడు రాజధాని చెన్నై మరోసారి వరద గుప్పిట్లో చిక్కుకుంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తుపాను చెలరేగింది. దీంతో రానున్న 5 రోజులు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరికలతో సిటీ జనం ఆందోళనకు గురవుతోంది. 2015 నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.

తమిళనాడుకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఇప్పటికే 24 గంటల నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. చెన్నై సిటీ శివార్లలో వందల ఎకరాల పంట నాశనమైంది. వరదనీరు పొలాల్లోకి ప్రవహించడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పంటపొలాల్లోని నీటిని తరలించేందుకు అధికారులు రోడ్లను తెగ్గొట్టడంతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంబరబాక్కం జలాశయంలో ఇప్పటికే 21.15 అడుగులకు నీటమట్టం చేరింది. ఈ జలాశయం మొత్తం సామర్ధ్యం 25 అడుగులు. నీటిమట్టం 22 అడుగులకు చేరితే క్రస్ట్ గేట్లు ఎత్తివేస్తామని అధికారులు అంటున్నారు. అదే జరిగితే దిగువ ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. 

తమిళనాడులో మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా ప్రభుత్వ యంత్రాగం సహయక చర్యలను వేగవంతం చేసింది. దీనికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. యేటా అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలు డిసెంబర్ దాకా కొనసాగుతాయి. ఈసారి ఆలస్యంగా అక్టోబర్ 28న ప్రవేశించి.. అధిక వర్షపాతానికి కారణమయ్యాయి.

దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో మరో ఐదురోజులపాటు ఉరుములు, పిడుగులతో పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన ఏర్పడే అల్పపీడన ద్రోణి 48 గంటల్లో బలపడి.. ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని ఐఎండీ తెలిపింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తిరిగి చేరుకోవాలని పేర్కొంది. బంగాళాఖాతం మధ్యన పశ్చిమాన, చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉరరితల ద్రోణి కారణంగా ఐదురోజులపాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో తమిళనాడు ప్రజలకు ముఖ్యంగా చెన్నవాసులకు 2015 నాటి వరద బీభత్సం కళ్లముందు కదలాడుతూ భయం గొలుపుతోంది. 

- Advertisement -

మరోవైపు ప్రభుత్వ అన్నివిధాలా ముప్పు ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం రెడీ అవుతోంది. రుతుపవనాల వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులలో రక్షణ చర్యలు చేపట్టేందుకు 8,462 అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంధ సేవకులు సిద్ధంగా ఉంచింది స్టాలిన్ సర్కారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం కంట్రోలు రూం ఏర్పాటు చేసి 044–24331074/ 24343662/1070/ 9445869843 ఫోన్‌ నెంబర్లను కేటాయించింది. అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడే ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇప్పటికే అధికారులతో సమావేశమయ్యారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement