Wednesday, May 15, 2024

క్రమంగా తగ్గుతున్న గోదావరి.. 60.2 అడుగుల నీటిమట్టం

భద్రాచలం, ప్రభన్యూస్‌: భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుతోంది. 32 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 70.8 అడుగులకు చేరిన గోదావరి ఆదివారం సాయంత్రం గం.6.00ల సమయంలో 60.2అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వద్దే కావడంతో హెచ్చరిక కొనసాగుతుంది. శుక్రవారంతో పోలిస్తే పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ సాధారణ స్థితికి మాత్రం రాలేదు. పట్టణంలోని అయ్యప్ప కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీ, శాంతినగర్‌ కాలనీ, ఏఎంసీ కాలనీ, కొత్తకాలనీ వంటి ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగి ఉన్నాయి. చర్ల మండలంలో ఇంకా విద్యుత్‌ పునరుద్ధరణ జరగలేదు. దుమ్ముగూడెం మండలంలో సైతం పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. చర్లలో 1269 కుటుంబాలకు చెందిన 4478మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దుమ్ముగూడెం మండలంలో 920కుటుంబాలకు చెందిన 3506మంది తమ ఇండ్లను వదిలి వచ్చారు. భద్రాచలం పట్టణంలో 1242కుటుంబాలకు చెందిన 4747మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఒక్క సుభాష్‌ నగర్‌ కాలనీ నుంచే 1500మందికి పైగా పునరావాస కేంద్రంలో ఉన్నారు. అశోక్‌నగర్‌ కొత్త కాలనీ నుంచి మరో వెయ్యి మంది వరద ముంపునకు గురయ్యారు. వీరందరికీ స్థానిక పునరావాస కేంద్రాల్లో ఆహారాన్ని, మంచినీరు అందిస్తున్నారు. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షం ఏజన్సీ వాసులను ఆందోళనకు గురిచేసింది. మరో రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉందనే వార్తలతో పరిస్థితులు తిరిగి భయానకంగా మారతాయని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో రామాలయం వద్ద చేరిన నీరు…
విస్తా కాంప్లెక్స్‌ వద్ద వరద నీటిని మోటార్‌లతో తోడే ప్రక్రియలో ఇంజన్‌లు విఫలమవడంతో కుంటుపడింది. సీఎం కేసీఆర్‌ భద్రాచలం పట్టణానికి ఆదివారం విచ్చేస్తున్న క్రమంలో నీటిని ఎత్తిపోసే పనులపై అధికారులు కొంత అలసత్వాన్ని చూపారు. ఈ క్రమంలో శనివారం నాడు రామాలయం పడమర మెట్ల వద్ద అర అడుగు నిలిచిన వరద నీరు మోటార్‌లు పనిచేయకపోవడంతో ఏకంగా మూడు అడుగులకు పైగా చేరింది. 20కిపైగా దుకాణాలు నీట మునిగాయి. ఒకింత మోటార్‌ల విషయంపై అధికారులు దృష్టిసారించి ఉంటే ఆ ప్రాంతంలో లక్షల రూపాయల నష్టం ఏర్పడేది కాదు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి, ఆదివారం పగలు గంటల కొద్దీ విద్యుత్‌ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు నిద్రలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. పునరావాస కేంద్రాల్లో భోజనాలు సమయానికి అందడం లేద ని పలువురు నిర్వాసితులు వాపోయారు. ఈ క్రమంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనాలు అందించారు. టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రేమ్‌ కుమార్‌, సిపిఎం, బిసిఆర్‌ ట్రస్టు, సిపిఐ, జేడీ ఫౌండేషన్‌, జిందా బ్లడ్‌ డోనర్స్‌క్లబ్‌ తదితరులు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వారికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో పారిశుద్ద్యంపై గ్రామ పంచాయతీవారు దృష్టిసారించారు. ఆదివారం సాయంత్రం ఫాగింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement