Thursday, May 2, 2024

లైఫ్‌సైన్సెస్‌ స్టార్టప్‌లకు ఊతంగా బీ హబ్‌.. జీనోమ్‌ వ్యాలీలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీ హబ్‌ ఏర్పాటుతో టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీలకు అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి బయో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లోని స్టార్టప్‌ కంపెనీలకు ఊతమివ్వనుంది. ఇందుకుగాను హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో ప్రత్యేకంగా బయోటెక్‌ హబ్‌( బీహబ్‌) పేరుతో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేటర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికి ఇటీవలే ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. బీ హబ్‌ నిర్మాణాన్ని ఈ ఇంక్యుబేటర్‌లో లైఫ్‌సైన్సెస్‌ రంగానికి చెందిన వందలాది స్టార్టప్‌ కంపెనీలకు వాటి వ్యాపారం తొలిరోజుల్లో అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించనుంది. మౌళిక సదుపాయాలతో బయోఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగంలోని కంపెనీలకు ప్రధానంగా అవసరమయ్యే అత్యాధునిక సదుపాయాలు కల పరిశోధన ల్యాబ్‌ను నిర్మించనుంది. ఈ ల్యాబ్‌ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలకు అత్యాధునిక పరిశోధన కేంద్రం కలిగిన క్లస్టర్‌గా జీనోమ్‌ వ్యాలీ ఖ్యాతికెక్కనుంది.

900 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం…

బీ హబ్‌ ఇంక్యుబేటర్‌ను ప్రభుత్వం రూ.900 కోట్ల భారీ ఖర్చుతో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ పద్ధతిలో నిర్మించనుంది. బీ హబ్‌ నిర్మించిన తర్వాత లైఫ్‌సైన్సెస్‌ రంగంలోని కాంట్రాక్టు రీసెర్చి కంపెనీలు, కాంట్రాక్టు తయారీ కంపెనీలకు ల్యాబ్‌ ప్రదేశాన్ని డెవలపర్‌ అద్దెకు ఇవ్వనుంది. వీటితో పాటు స్టార్టప్‌ కంపెనీలకు ప్రభుత్వం పలు రాయితీలు కల్పించనుంది. బీ హబ్‌ నిర్మాణానికి ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ అనే ప్రఖ్యాత లైఫ్‌సైన్సెస్‌ కంపెనీల కార్యాలయ ప్రదేశ డెవలపర్‌ ముందుకు రావడం పట్ల పరిశ్రమ శాఖ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి.

100 బిలియన్‌ డాలర్ల విలువే లక్ష్యం…

- Advertisement -

రాష్ట్రంలో ప్రస్తుతం ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో ఉత్పత్తుల విలువ ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విలువను రానున్న రోజుల్లో 100 బిలియన్‌ డార్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే బీ హబ్‌ లాంటి భారీ ఇంక్యుబేటర్‌ ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బీ హబ్‌లో ఏర్పాటు కానున్న స్టార్టప్‌లు, సీఆర్‌వో, సీడీఎంవో కంపెనీలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమకు జీనోమ్‌ వ్యాలీతో ఏర్పడే వాల్యూ చైన్‌ సంబంధాలు పటిష్టమవుతాయని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌లో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement