Sunday, May 5, 2024

HYD: మోసం చేసిన ముఠా అరెస్ట్.. 102 ఐ ఫోన్లు స్వాధీనం

గోషా మహల్, జనవరి 5 (ప్రభ న్యూజ్) : ఐ ఫోన్‌‌లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను ఆబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.64 లక్షలు విలువ చేసే 102 ఐ ఫోన్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ పీఎస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆకుల చంద్రశేఖర్, సీఐ నరసింహా రాజు, ఎస్ఐ సుధాకర్ తో కలిసి మధ్య మండలం డీసీపీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో మొబైల్ షాప్ నడుపుతున్న అబ్దుల్లా విరాని గత ఏడాది నవంబర్ 29న ముంబైకు చెందిన విజయ్ కుమార్, నిరవ్ రాజ్ నుండి హోల్ సేల్‌‌గా ఐ ఫోన్‌లు కావాలని కోరినట్లు తెలిపారు.

వారి మాటలు నమ్మిన అబ్దుల్లా విరాని 107 ఐ ఫోన్‌‌లను వారు చెప్పిన గుజరాత్ రాష్ట్రంలోని చిరునామాకు కొరియర్ ద్వారా పంపించాడని పేర్కొన్నారు. ఫోన్స్ అందగానే డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తామని నమ్మబలికిన సదరు వ్యక్తులు మొబైల్ ఫోన్‌లు రిసీవ్ చేసుకున్న అనంతరం డబ్బులు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారని వెల్లడించారు. దీంతో మొబైల్ దుకాణం యజమాని అబ్దుల్లా అబిడ్స్ పోలీసులకు డిసెంబర్ 8న ఫిర్యాదు చేశాడని, అతని ఫిర్యాదు మేరకు 420 కింద కేసు నమోదు చేసి సీఐ నరసింహారాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ బృందం గుజరాత్ కు వెళ్లి కేసులో ఏ2 గా ఉన్న నిరవ్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అతని నుంచి 102 ఐ ఫోన్‌‌లను స్వాధీనం చేసుకొని, అక్కడి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ లోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠాలోని కీలకమైన మరో నిందితుడు ఏ1 విజయ్ కుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని డీసీపీ వెల్లడించారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న నిందితుడు నిరవ్ రాజ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement