Sunday, May 5, 2024

పబ్‌లపై ఫోకస్‌: ఇక దాడులే – బార్లు, మద్యం దుకాణాలకు కఠిన నిబంధనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పబ్‌లలో డ్రగ్స్‌, పలు నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఇకపై రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాలపై నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సర్కార్‌ యోచిస్తోంది. 21 ఏళ్లలోపు మైనర్లకు మద్యం సరఫరా, సమయం మించిన తర్వాత మద్యం విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ చర్యలతో కట్టడి చేయాలని నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సుల రద్దుతోపాటు పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని యోచిస్తోంది. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించరాదని ఆబ్కారీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అంటోంది. ప్రతి బార్‌, వైన్‌ షాపు తప్పనిసరిగా 21 ఏళ్లలోపు మైనర్లకు మద్యం విక్రయించేదిలేదని బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇది ఎక్కడా అమలు కాకపోవడంపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి బార్‌, మద్యం దుకాణానికి చెందిన సిట్టింగ్‌లలో ఇకపై సీసీకెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణుం, బార్‌ నిర్దేశిత సమయాల్లోనే మూసివేసేలా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కల్లు దుకాణాల్లో దాడులను మరింత తీవ్రం చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌డీపీపై ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఎక్కువగా ఉదయం నిర్దేశిత సమయానికి ముందే మద్యం దుకాణాలు, బార్లు తెరిచి విక్రయాలను ప్రారంభిస్తున్నారని అందిన సమాచారంపై ప్రభుత్వం స్పందించింది. వీటిపై దాడులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్‌లపై తరచూ దాడులు చేయడంతోపాటు, వాటి యాజమాన్యాలకు కఠిన నిబంధనలను వెల్లడించారు. ఇకమీదట పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామనే హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలో మద్యం విక్రయాలు, ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయనే అంశాలను అధికారులు పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు 60శాతం విక్రయాలు సాగుతున్నాయని, రాత్రి 7 తర్వాత 12 గంటలవరకు ఒక్కసారిగా 40శాతం వినియోగం జరుగుతున్నట్లు గుర్తించారు. శని, ఆదివారాల్లో అర్దరాత్రి దాటిన తర్వాత విక్రయాలు ఊపందుకుంటున్నట్లు గుర్తించారు. వీకెండ్‌ విక్రయాలపై డిపోలు, ఎక్సైజ్‌ జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఇక సరిహద్దు జిల్లాల్లోని బార్లు, క్లబ్బులు, మద్యం దుకాణాల్లో లభించే ఇతర ప్రాంతాల మద్యం, మత్తుపదార్ధాల వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలా విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించడం సులువవుతోంది. దీనిని బార్లలో కూడా అమలులోకి తెచ్చి వీడియా కెమెరాలకు అనుసంధానించాలని నిర్ణయించారు.

పీడీ, బైండోవర్‌లకు లొంగని వైనం…
ఇప్పటికే పీడీ యాక్టు, బైండోవర్‌లను అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చట్ట సవరణద్వారా కఠిన శిక్షలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1968లో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏపీ ప్రొహిబిషన్‌ యాక్టులో కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు తేవాలని ఆదేశించారు.

వ్యాపారులపై కూడా పీడీ యాక్టు…
పీడీ యాక్టు…ప్రవెన్షన్‌ ఆఫ్‌ డిటెన్షన్‌ యాక్టు, దీనిని పార్లమెంటు చట్టంతో 1950లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1), 21(2) ద్వారా అమలులోకి తెచ్చారు. ఇందులో 34 సెక్షన్లు ఇమిడి ఉన్నాయి. దీనిని మరింత విస్తరించి మైనర్లకు మద్యం విక్రయించే వ్యాపారులపై కూడా మోపాలని నిర్ణయించారు. క్లబ్బులు, పబ్‌ల యాజమాన్యాలపై కూడా ఇకపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనల్లో మార్పులు తెస్తున్నారు. ఇందుకు ఇప్పటికే వారితో సమావేశమై ప్రభుత్వ చర్యలను వివరించారు. నేరుగా మొదటిసారి హెచ్చరికలు చేసిన ప్రభుత్వం ఇకపై వీకెండ్‌లతోపాటు, ఎప్పుడు వీలైతే అప్పుడు నేరుగా దాడులు చేసేలా ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement