Saturday, May 4, 2024

తెలంగాణ‌లో శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు.. 2,384 కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లుగా రాష్ట్రంలో పండిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేసేలా కార్యాచరణ వేగవంతం అవుతోంది. కేంద్రం సహకరించకపోయినా గన్నీ బ్యాగుల సేకరణతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అన్ని ఏర్పాట్లతో ప్రభుత్వ ఆధ్వర్యంలో శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6920 కొపుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 1960 మద్ధతు ధరకే ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 6.85 కోట్ల గన్నీ బ్యాగులను ప్రభుత్వం సిద్ధం చేసింది. ధాన్యం కొనుగోలు జరిగిన రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులను చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 35.80లక్షల ఎకరాల్లో వరిపంట సాగుకాగా, 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతను నిర్దేశించుకున్నది. ఇందుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కార్యాచరణ ముమ్మరం చేసిన ప్రభుత్వం ప్రత్యేకాధిరులతో పర్యవేక్షణ జరుపుతోంది.

3500లకుపైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవగా, మిగిలిన కేంద్రాలకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. మిల్లర్లకు బోనస్‌ లేదంటే సీఎంఆర్‌ కోటా తగ్గింపులపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యక్రమం నిర్దేశించుకొని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని జిల్లాల వారీగా ఏరోజుకారోజు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రోజుకు కనీసం నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రైతుల మేలు కోసం నిర్వహిస్తున్న ఈ ధాన్యం కొనుగోళ్లను అత్యంత జాగ్రత్తగా విజయవంతం చేయాలని, రైతులెవరికీ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోళ్లకు అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు అయినట్లుగా తేలింది. ఇందులో 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి సాగవగా, 50 లక్షల ఎకరాలలో వరి పంట, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని, ఈ ఏడాది రైతులను పత్తిసాగు దిశగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు ఉన్నాయి. వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించారు. ఈ సందర్భంగా క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement