Friday, April 26, 2024

వానాకాలంలో 19.50 కోట్ల మొక్కల లక్ష్యం.. 8వ విడత హరితహారంపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ ఏడాది వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 19.50 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం అన్ని విభాగాలు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం బీఆర్కే భవన్‌ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్‌ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వలన రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.70 శాతం పెరిగిందని సోమేష్‌ కుమార్‌ గుర్తు చేశారు.

అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఏర్పాటు చేయని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. దీనితో పాటు ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్‌ పల్లె ప్రకృతి పనాలు ఏర్పా’టు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతి మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఖాళీ స్థలాలను గుర్తించి, చిక్కటి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు మూడు సార్లు నీటిని పోసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద కాలువ గట్లపై పచ్చదనం పెంపు, తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచటం ఎనిమిదవ విడత హరితహారం ప్రాధాన్యత అంశాలు అని సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మంజారు చేసిన లబ్ధిదారులను గుర్తించి వెంటనే దళితబంధు యూనిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. వరి ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.4 కోట్లు త్వరలో వస్తాయని ఆయన తెలిపారు. అన్ని రైతు వేదికల్లో రైతు సమావేశాలు నిర్వహించి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిచాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. రైతువేదికలను క్రియాత్మకంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌. ఎం. డోబ్రియాల్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌ కుమార్‌, హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement