Monday, April 29, 2024

KCR – ఏమరపాటొద్దు… ట్రబుల్ షూటర్స్ కు కెసిఆర్ మార్గ నిర్దేశం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

”ఇప్పటివరకు అంతా సవ్యంగానే ఉంది.. ఇదే విధానంతో ముందుకు పోదాం.. కొన్ని ప్రతికూల పరిస్థితులకు కాలమే సరైన పరిష్కారం.. ఇది అత్యంత సున్నితమైన సమయం, సందర్భం.. ఆవేశాలు, ఆక్రోషాలు వద్దేవద్దు.. అనర్థాలను కొనితెచ్చు కోవద్దు.. ఏమాత్రం ఏమరపాటు జరిగినా.. సమస్య చిలికిచిలికి గాలివానలా మారొచ్చు.. ప్రజాక్షేత్రంలో దూసు కుపోతున్న అభ్యర్థులను ఉత్తేజపరుస్తూ ముందు వెళ్ళిండి..” అంటూ భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. ట్రబు ల్‌ షూటర్లు కేటీ రామారావు, హరీష్‌రావులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రతి అంశాన్నీ తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. అవకాశం దొరికితే చాలు.. గోరంతను కొండంత చేసి రాజ కీయ లబ్ధి పొందాలని చూస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపా లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంగా జాగ్రత్తగా శోధించి నిర్ణయాలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.

గత రెండు వారాలుగా చేసిన ఎన్నికల కసరత్తు అమలు నేపథ్యంలో అత్యంత సున్నితమైన అంశాలపై గురువారం ప్రగతిభవన్‌ వేదికగా కేసీఆర్‌ రెండు గంటలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆపరేషన్‌ గులాబీని సక్సెస్‌ చేయడమే లక్ష్యంగా పనిచేసే వ్యూహాన్ని, నియోజక వర్గాల వారీగా అనుసరించాల్సిన విధానాలను వారికి వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వరుస పర్యటనల్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు. అదే సమయంలో కీలకమైన నేతలు సభల్లో ప్రకటించాల్సిన, ప్రజలకు చెప్పాల్సిన రాజకీయ అంశాలను గురించి వివరించారు. గడిచిన పదేళ్ళుగా పార్టీలో కీలక భూమిక పోషించి నిబద్ధతతో పనిచేసిన వాళ్ళకు బీఆర్‌ఎస్‌ సంస్థాగతపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాలని, ఎన్నికల్లో ఆర్థిక నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కూడా సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కీలక నిర్ణయాలపై వారం రోజుల్లో ట్రబుల్‌ షూటర్లతో రెండోసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చే పథకాలు, కార్యక్రమాల ఫలితాలు ఎలాగున్నా.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లకు మరిన్ని తాయిలాలు అవసరమన్న కొంతమంది నేతల అభిప్రాయాలను మంత్రిలిద్దరికీ కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఆ దిశగా మేధోమదనం జరిపిన అనంతరం మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన కొత్త కార్యక్రమాలు, రాయితీలతో కూడిన పథకాలు, సన్నకారు రైతులు, యువత, మహిళలే లక్ష్యంగా అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలను గురించి చర్చించి ఈ భేటీలో తుదినిర్ణయం తీసుకున్నారు. సక్సెస్‌ వైపు దూసుకెళ్ళడమే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహరచనను ప్రజాక్షేత్రంలో అమలు చేయడమే కాని, ఎక్కడా బహిరంగంగా నోరు జారవద్దని అధినేత హితవు చెప్పారు. అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇచ్చే తేదీలు ఖరారు చేసే అంశంపై కూడా చర్చించారు. అనుకూల, ప్రతికూలతలపై అధినేత లోతుగా ఆరా తీశారు.

- Advertisement -

నియోజకవర్గాల వారీగా పరిస్థితులను వివరించిన మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు రెండు రోజుల్లోగా మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ అత్యవసర భేటీలో కొంతమంది గోడదూకుడు నేతలను లిస్ట్‌ఔట్‌ చేసినట్లు, ఇతర పార్టీల వైపు తొంగి చూడకుండా వారిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దెశం చేశారు. పార్టీలో బీసీ కులాల అంశం అత్యంత కీలకంగా వినిపిస్తున్న క్రమంలో ఆ వర్గాలకు చెందిన కీలక నేతలను పిలిపించుకుని తగిన హామీలు ఇవ్వాలని సీఎం సూచించారు. రాజకీయ భవిష్యత్తుపై భరోసా కల్పించి విజయం దిశగా వారిని ముందుకు నడిపించాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో సెకండ్‌ కేడర్‌ నేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్న క్రమంలో వారిని నివారించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి నేతలను కూడా కాపాడుకుంటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగాలని అధినేత ఈ సందర్భంగా ట్రబుల్‌ షూటర్లకు హితోపదేశం చేశారు.

జోరు పెంచి దూసుకుపోవాల్సిందే..
”ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ప్రచారంలో మరింత జోరు పెంచాలి.. అభ్యర్థులు దూకుడు ప్రదర్శించాలి… నిలకడ లేకుండా కార్యక్రమాలను రూపొందించుకుని వాటిని క్రమం తప్పకుండా నిర్వహించాలి” అని బీఆర్‌ఎస్‌ అధినేత యువనేతలకు సూచించారు. అలాగే ఈ సారి కూడా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని.. హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టు-దలతో ఉన్నారు. అయితే, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల కంటే ముందే ఉన్నారు. ఇప్పుడే కాదు.. గత ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి కూడా అదే జరిగింది. మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఈ స్థానాలకూ అభ్యర్థులను అతిత్వరలోనే సమావేశం తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సమయం ముంచుకొస్తున్న కొద్దీ.. ఎన్నికల ప్రచారం సహా, పార్టీలో అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు.. ఈ నెల 15వ తేదీ నుంచి కేసీఆర్‌ నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగున్న విషయం తెలిసిందే. 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించేలా షెడ్యూల్‌ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కేటీ-ఆర్‌, హరీశ్‌రావు సహా ఇతర ముఖ్య నేతలంతా సభలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో బహిర్గతమైన ప్రతికూల అంశాలపై తాజాగా జరిగిన ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement