Tuesday, May 7, 2024

టీఆర్​ఎస్​ ప్లీనరీలో ఇష్టమైన రుచులతో విందు.. ప్రత్యేక వంటకంగా నాటుకోడి పులుసు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టిఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుక (ప్లీనరీ)కు హాజరైన అతిథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కోసం నోరూరించే వంటకాలను వడ్డించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మూడు వేల మందితో పాటు బందోబస్తు విధులో ఉన్న పోలీసులు, మీడియా సిబ్బంది, గన్‌మెన్లు, డ్రైవర్లు ఇతరులు తమకు ఇష్టమైన రుచులతో విందు ఆరగించారు. సిఎం కేసీఆర్‌కు ఇష్టమైన వంటకాలన్నీ మెనూలో ఉన్నాయి. ప్రత్యేకించి రంజాన్‌ సందర్భంగా హలీమ్‌ను కూడా వడ్డించారు. బందోబస్తులో ఉన్న పోలీసుల కోసం భోజనం పార్శిల్‌ను అందజేశారు. సిఎం కేసీఆర్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలిపి ఏర్పాటు చేసిన ఒకే డైనింగ్‌ హాల్‌లో భోజనాలు చేశారు. మీడియా, పోలీసులు, పురుషులు, మహిళలకు ప్రత్యేకం డైనింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతినిధులు ఇబ్బంది పడకుండా, తొక్కిసులాట జరగకుండా మొత్తం 30 డైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

భోజనాల తయారీలో 350 మంది వంటపనివారు, 250 మంది వాలంటీర్లు భోజన వడ్డనలో పాల్గొన్నారు. విఐపీలు, కార్యకర్తలు అనే విభేదం లేకుండా అందరికీ కలిపి ఒకే రకమైన తెలంగాణ సంప్రదాయ రుచులతో వెరైటీ వంటకాలను వండారు. అల్పాహారం నుంచి భోజనాలు, ఐస్‌క్రీమ్‌, జిలేబీ, గులాబ్‌ జామ్‌ స్పీట్స్‌, ఫ్రూట్‌ సలాడ్‌ వరకు అతిథుల కోసం 33 రకాల వంటకాలు తయారు చేశారు. మాంసాహార ప్రియుల కోసం తెలంగాణ నాటు కోడి పులుసు, చికెన్‌- మటన్‌ బిర్యాని, ఎగ్‌ మసాలా, మటన్‌ నల్లపొడి వేపుడు, మటన్‌ దాల్చా, బోటి వేపుడు, పాయా సూప్‌, తలకాయ పులుసు వడ్డించారు. దాదాపు పది క్వింటాళ్ళ చొప్పున మటన్‌, చికెన్‌, బిర్యానీ కోసం పది క్వింటాళ్ళ చికెన్‌, మరో ఆరు కిలోల నాటు కోడి మాంసం, పది వేల గుడ్లుతో వంటకాలు చేశారు.

కూరగాయల వంటకాల్లో గుత్తి వంకాయ, జీడిపప్పు బెండకాయ వేపుడు, పచ్చడలు, రోటీ, ఆలూ క్యాప్సికం, వెజ్‌ బిర్యాని, బగారన్నం, వైట్‌ రైస్‌, చామగడ్డ పులుసు, మామిడికాయ పప్పు, పచ్చిపలుసు, ముద్దపప్పు, దోసకాయ పప్పు, ముల్కాడ, సాంబారు, ఉలవ చారు, వంకాయ పచ్చడి, బీరకాయ, టమాట చట్నీ, ఆవకాయ, పెరుగు, పెరుగు చట్నీ, వడియాలు, మిర్చి బజ్జీ వంటి వెరైటీలు వడ్డించారు. వేసవి దాహార్తి తీర్చేందుకు చల్లని మజ్జిగ, రాగిఅంబలి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement