Sunday, May 12, 2024

క‌రీంన‌గ‌ర్‌లో 5 వేల మందితో మెగా 5k రన్.. విశేష స్పందన వ‌చ్చింద‌న్న సీపీ స‌త్య‌నారాయ‌ణ

ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు) సందర్భాన్ని పురస్కరించుకుని కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లో జరిగిన మెగా 5కే రన్ కు విశేష స్పందన లభించింది. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, పోలీసు శిక్షణ సంస్థలకు చెందిన దాదాపు 5వేల మంది ఈ రన్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఈ 5కే రన్ ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మార్క్ ఫెడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై రాంనగర్ – మంకమ్మ తోట – గీత భవన్ చౌరస్తా ల మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఫ్లాగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తుండడం ఆహ్వానించదగిన పరిణామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో కరీంనగర్ రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్నదని చెప్పారు. పోలీసు అమరవీరుల ఆశయాల సాధన కోసం అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసు అమరవీరులు సమాజంలో శాంతి స్థాపన కోసం వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం వల్లనే నేడు సమాజం శాంతియుతంగా వర్ధిల్లుతున్నదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపి లు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, సి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు సిహెచ్ నటేష్, లక్ష్మీ బాబు, దామోదర్ రెడ్డి, రవీందర్, తిరుమల్ గౌడ్, ఆర్ఐ లు కిరణ్ కుమార్, రమేష్, మల్లేశం, జానీ మియా లతో పాటుగా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, పోలీసు శిక్షణ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement